ఇండోనేసియాలో భూకంపం..162 మంది మృతి

ఇండోనేసియాలో భూకంపం..162 మంది మృతి
  • కూలిన వేలాది ఇండ్లు
  • మృతుల్లో పిల్లలే ఎక్కువ.. మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్
  • రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ప్రకంపనలు


జకార్తా/సియాంజుర్: భూకంపంతో ఇండోనేసియా చిగురుటాకులా వణికింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ఏర్పడిన ప్రకంపనలకు జావా ద్వీపంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సియాంజుర్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో 56 మందికి పైగా చనిపోగా, 700 మందికి పైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. వేలాది ఇండ్లు, ఆఫీసులు కూలిపోయాయి.

శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ టీమ్​లకు సిటిజన్లు సాయం చేస్తున్నారు. మరోవైపు మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలకు ఇండోనేసియా వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం రాత్రి పూట సంభవించి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని అధికారులు చెప్పారు.

వీధుల్లోకి పరుగులు

సోమవారం మధ్యాహ్నం సమయంలో వెస్ట్ జావా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని సియాంజుర్ రీజియన్‌‌‌‌‌‌‌‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కనీసం 25 ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ఇండ్ల గోడలు, పైకప్పులు కూలిపోయాయి. సాయంత్రానికి 56 మందికి పైగా చనిపోయినట్లు సియాంజుర్ రీజెన్సీ హెడ్ హెర్మన్ సుహెర్మన్ చెప్పారు.

వందలాది మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు. రక్తపు మరకలతో.. దుమ్ము కొట్టుకుపోయి చాలా మంది సిటిజన్లు వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం వల్ల సియాంజుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ తెలిపింది. బాధితులు, నష్టంపై ఇంకా సమాచారం సేకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఇండ్లల్లో ఉండొద్దు

మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలను ఇండోనేసియా వాతావరణ సంస్థ(బీఎంకేజీ) హెచ్చరించింది. ‘‘మరిన్ని శక్తిమంతమైన ప్రకంపనలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజలు బిల్డింగుల్లో ఉండొద్దు. ప్రస్తుతానికి ఆరుబయటే ఉండండి” అని బీఎంకేజీ చీఫ్ ద్వికోరిటా కర్నావటి సూచించారు. దీంతో వేలాది మంది వీధుల్లోనే ఉండిపోయారు. ముందుజాగ్రత్తగా హెల్మెట్లు, ఇతర ప్రొటెక్షన్ టోపీలు పెట్టుకున్నారు. 

ఆస్పత్రులు ఫుల్.. ఆరుబయటే చికిత్స

గాయపడ్డవాళ్లు పెద్ద సంఖ్యలో రావడంతో సియాంజుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రభుత్వ ఆస్పత్రి అత్యవసర చర్యలు చేపట్టింది. ఆరుబయటే టెంట్లు వేసి వైద్యులు వారికి చికిత్స అందించారు. మరోవైపు ప్రధాన ఆస్పత్రులన్నీ నిండిపోవడంతో గాయపడ్డ వారిని ఆస్పత్రుల బయట, టెర్రస్‌‌‌‌‌‌‌‌లు, పార్కింగ్‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో స్ట్రెచర్లు, బ్లాంకెట్లపై ఉంచి చికిత్స అందించారు. చాలా మంది పిల్లలకు ఆక్సిజన్ మాస్క్‌‌‌‌‌‌‌‌లు పెట్టారు.

భూకంపం వల్ల సయాంగ్ ఆస్పత్రిలో కరెంటు పోయిందని, దీంతో బాధితులకు డాక్టర్లు వైద్యసేవలు అందించలేకపోయారని సియాంజుర్ అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానికులు ట్రక్కులు, బైకులపై ఆస్పత్రులకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తమ వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు బాధితుల బంధువులు ఆస్పత్రులకు తరలివచ్చారు.

ప్రధాన సిటీకి బయట ఉండే వారు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని, మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు చెప్పారు. ‘‘ఎమర్జెన్సీ చికిత్స అవసరమైన వారికి ఆస్పత్రిలో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాల నుంచి అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లు వస్తూనే ఉన్నాయి. గ్రామాల్లో చాలా కుటుంబాలు ఉంటున్నాయి. వారిని ఖాళీ చేయించలేదు” అని అన్నారు.  

దేశంలో తరచూ భూకంపాలు

  • ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అగ్నిపర్వత విస్పోట నాలు, సునామీలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. దేశ భూభాగం ‘రింగ్ ఆఫ్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పై ఉండటమే ఇందుకు కారణం.
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్ట్ సుమత్రా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో 6.2 తీవ్రతతో నమోదైన భూకంపం వల్ల 25 మందికి పైగా చనిపోయారు. 460 మంది దాకా గాయపడ్డారు.
  • కిందటేడాది జనవరిలో వెస్ట్ సులవేసి ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 100 మందికిపైగా చనిపోయారు. 6,500 మంది గాయపడ్డారు. 
  • 2004లో వచ్చిన సునామీ, భూకంపం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షల మంది చనిపోయారు. ఇందులో ఇండోనేసియాలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి.