మయన్మార్‎లో 4.7 తీవ్రతో భూకంపం.. ఇండియాలో వణికిన ఈశాన్య రాష్ట్రాలు

మయన్మార్‎లో 4.7 తీవ్రతో భూకంపం.. ఇండియాలో వణికిన ఈశాన్య రాష్ట్రాలు

నైపిడా: మయన్మార్‎లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం (సెప్టెంబర్ 30) తెల్లారుజూమున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై 4.7గా నమోదైంది. ఇండియాపై కూడా ఈ కంప ప్రభావం పడింది. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ సహా భారతదేశంలోని అనేక ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. మంగళవారం (సెప్టెంబర్ 30) ఉదయం 6.10  గంటలకు ఇండో-మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా -మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఆగ్నేయంగా కేవలం 27 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 15 కిలో మీటర్ల లోతులో ఉందని ఎన్‎సీఎస్ వెల్లడించింది. 

ఒక్కసారిగా భూమి కంపించడంతో ఈశాన్య ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్ధంకాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపానికి సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మరోవైపు.. భూకంపం నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టింది. 

కాగా, 2025, సెప్టెంబర్ 14న కూడా మయన్మార్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 4.6గా నమోదు అయ్యింది. తిరిగి 15 రోజుల వ్యవధిలోనే ఆ దేశంలో మరోసారి భూకంపం వచ్చింది. మయన్మార్ దేశం -ఇండియన్, యురేషియన్, సుండా, బర్మా నాలుగు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఉంది. దీనితో తరుచుగా ఈ దేశం భూకంపాలకు గురవుతుంది.