ఎంతైనా తినండి.. బిల్లు మీ ఇష్టం..!

ఎంతైనా తినండి..  బిల్లు మీ ఇష్టం..!

ఈ రోజుల్లో మనం ఏదైనా హోటల్‌కి వెళ్లి భోజనం చేస్తే ఎంతకాదన్నా మినిమం రెండు వందలు అవుతుంది. అందుకే బయటకు వెళ్లి భోజనం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఇక రెస్టారెంట్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి రోజుల్లో ‘కడుపు నిండా తిని.. డబ్బులు మాత్రం మీకు తోచినంత ఇవ్వండి’ అని ఎవరైనా అంటారా. ఇందులో ఏదో తిరకాసు ఉందనుకుంటున్నారు కదా.. కానీ అలాంటిదేమీ లేదు. అయితే ఆ హోటల్ ఎక్కడుంది? అసలు ఏం వడ్డిస్తారు? అన ఆలోచిస్తున్నారు కదా.. అయితే ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం..

కేరళలోని కొల్లాం రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో యశోదమ్మ హోటల్ అని ఉంది. ఆ హోటల్‌లో పనివాళ్లు ఎవరూ ఉండరు. ఒకే ఒక్క వృద్ధ మహిళ అన్నీ తానై వంట చేస్తుంది.. వడ్డిస్తుంది. ఆమె ఎవరో కాదు.. హోటల్ యజమాని యశోదమ్మ. ఆమె వయసు దాదాపు 70 ఏళ్లు. ఆమె ఉదయాన్నే అయిదు గంటలకు నిద్ర లేచి పది గంటలకల్లా వంటకాలను సిద్ధం చేస్తుంది. కనీసం 50 మందికి సరిపడా భోజనాన్ని కేవలం ఐదు గంటల్లో తయారుచేస్తుంది.  ఈ వయసులో.. ఎవరి సాయం తీసుకోకుండా ఆమె ఒక్కరే వంటలు సిద్ధం చేయడమంటే ఆషామాషీ కాదు. అలా అని ఏదో ఒకటి వండిపెట్టకుండా వెజ్, నాన్ వెజ్ వంటకాలను కమ్మని రుచితో తయారుచేస్తుంది. ఈమె హోటల్‌లో ఎటువంటి ధరల పట్టికలు ఉండవు.. క్యాషియర్ ఉండడు. కేవలం ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది. అదే ఆ హోటల్‌లో క్యాష్ కౌంటర్. భోజనం చేసిన వాళ్లు ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఆ బాక్స్‌లో వేసి వెళ్తే చాలు. దాదాపు 70 ఏళ్ల వయసులో ఇంత కష్టపడుతూ.. లాభాపేక్ష లేకుండా ఆమె చేసే సేవపై చుట్టుపక్కల వాళ్లు ఎంతో మెచ్చుకుంటున్నారు. ఈ హోటల్ గురించి యశోదమ్మను అడిగితే.. పక్కవారి ఆకలి తీర్చడంలో కన్నా సంతృప్తి ఇంకెందులో ఉంటుందని ఆమె అంటున్నారు. ఆ హోటల్ సమీపంలో పలు కోచింగ్ సెంటర్లున్నాయి. దాంతో విద్యార్థులు, ఫ్యాకల్టీ, బాటసారులు యశోదమ్మ హోటల్‌కు క్యూ కడుతున్నారు.