నేనున్నంతవరకు ఏ పథకాలు ఆగనీయను

నేనున్నంతవరకు ఏ పథకాలు ఆగనీయను

హనుమకొండ: ఓట్లుంటేనే కేసీఆర్ బయటకు వస్తారని.. ఓట్లు లేకపోతే ఫామ్‎హౌస్‎లోనో లేకుంటే ప్రగతి భవన్‎లోనో మాత్రమే ఉంటారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్‎కు ఓటేయకపోతే కల్యాణలక్ష్మి, ఫించన్, దళితబంధులాంటి పథకాలు ఇవ్వమని బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపూర్ మండలం కొత్తపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘వర్షాలతో ధాన్యం తడుస్తోంది. వెంటనే ఐకేపీ సెంటర్లు తెరువాలి. దేశంలో ఎక్కడాలేని విధంగా మా పార్టీ ఉండాలని టీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారు. ఓటుహక్కు ఉన్నోళ్లంతా కేసీఆర్‎కే ఓటేయాలని బెదరిస్తున్నారు. ఓటేయకపోతే కల్యాణలక్ష్మి, ఫించన్, దళితబంధులాంటి పథకాలు ఇవ్వమని బెదిరిస్తున్నారు. పథకాలు ఆపడం వాళ్ల వల్ల కాదు. ఈ డబ్బులు కేసీఆర్ తన భూములమ్మి ఇవ్వడం లేదు. మనం చెల్లించే పన్నులతోనే ఈ డబ్బులన్నీ వస్తున్నాయి. కేవలం మద్యం అమ్మకాల ద్వారానే 30 వేల కోట్లు ఆదాయం వస్తోంది. నేను హామీ ఇస్తున్నా... నేనున్నంతవరకు మీకు ఏ పథకాలు ఆగనీయను. ప్రజల మీద నమ్మకం లేకనే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈటల రాజేందర్‎ను ఓడిస్తే.. మరో 20 ఏళ్ల పాటు వాళ్ల కుటుంబపాలన, రాచరికం కొనసాగించుకోవచ్చని చూస్తున్నారు. థమ్సప్ బాటిల్, మందుబాటిల్, గొర్రెపిల్లల దాకా దసరాకు కావాల్సిన సామాగ్రి అంతా వాళ్లే పంపించారు. ఈటల రాజేందర్‎కు ఓటేస్తామని చెపితే చాలు.. అక్కడ వాలిపోతున్నారు. ఈసారి మీ దగ్గరకు వస్తే లక్ష రూపాయలిస్తేనే ఓటేస్తామని చెప్పండి. ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన నన్ను మర్చిపోతారా? పచ్చని సంసారంలో కేసీఆర్ చిచ్చుపెడుతారు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇస్తున్న పథకాలతో పాటు.. కేసీఆర్ ఓ కత్తి హరీశ్ రావుకు ఇచ్చి పంపాడు. ఆ కత్తితో నన్ను ఓటు రూపంలో పొడిపించాలని చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనైనా, మంత్రిగానైనా హుజురాబాద్‎కు పేరు తెచ్చేలా పనిచేశాను. ఆ పేరును చెరిపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. దాన్ని మనమే కాపాడుకోవాలి. కేసీఆర్ అహంకారం.. పేదల బతుకుల మధ్య జరుగుతున్న పోరాటంలో మీరు ఆగం కాకండి. పథకాల వల్లే మనం బతుకం.. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. మూడున్నరేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న.. ఒడ్డు దిగాక బోడమల్లన్న. ఓట్లు అయ్యేదాకానే హామీలు.. ఓట్లుంటేనే కేసీఆర్ బయటకు వస్తాడు. ఓట్లు లేకపోతే.. ఫామ్ హౌస్ లేకుంటే ప్రగతి  భవన్‎లో మాత్రమే కేసీఆర్ ఉంటారు. ఏమిచ్చినా తీసుకోండి.. కానీ అది మీకు రావడానికి కారణం నేనేనని గుర్తుంచుకోండి’ అని ఈటల అన్నారు.