13 లేదా 14న బీజేపీలోకి ఈటల

13 లేదా 14న బీజేపీలోకి ఈటల

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 13 లేదా 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈటల ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అవినీతికి పాల్పడితే అప్పటి యూపీఏ సర్కార్ ఆయనపై ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. దళితులకు, బీసీలకు టీఆర్ఎస్​లో గౌరవం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటే తనకు అభిమానం, గౌరవం ఉందని, కానీ ఈటలపై ఆయన చేసిన కామెంట్లు సరికాదన్నారు. మంగళవారం జూమ్ ద్వారా సంజయ్ మీడియాతో మాట్లాడారు.

రూ.2,500 కోట్లు ఎటు పోయినయ్ కేసీఆర్

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ప్రధాని మోడీ ఈనెల 21 నుంచి ఫ్రీ వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పడంతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీకి థాంక్స్ చెపుతుంటే.. సంస్కారం లేని కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశారు. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ రూ.2,500 కోట్లతో వ్యాక్సిన్ వేయిస్తానని కేసీఆర్ చెప్పారు. అయితే ఇప్పుడు మోడీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటనతో అందులో వచ్చే కమీషన్ రాకుండా పోయిందనే బాధలో కేసీఆర్ ఉండి ఉంటారు. కేంద్రం ఫ్రీగా టీకాలు వేయడం వల్ల తన కుటుంబానికి ఏమీ మిగలడం లేదనే బాధ కేసీఆర్ ను వేధిస్తూ ఉంటుంది. అందుకే ఇతర సీఎంలకు కలిగిన సంతోషం కేసీఆర్ లో లేకపోయింది. ఇప్పుడు ఆ 2,500 కోట్లు ఎటు పోయాయో ఆయన చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

హెల్త్ స్టాఫ్ ను ఎందుకు నియమిస్తలే

రాష్ట్రంలో వ్యాక్సినేషన్​కు హెల్త్ డిపార్టుమెంట్ లో సిబ్బంది కొరత ఉందని, హాస్పిటల్స్ లో వసతులు కూడా లేవని బండి సంజయ్ అన్నారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సజావుగా సాగేందుకు సర్కార్ హాస్పిటల్స్ లో పర్మనెంట్ సేవలు, వసతుల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్​ను డిమాండ్ చేశారు. టీకా వేయించడంలో రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్ కోల్పోయారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేరుస్తామని, ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తామని చెప్పి సీఎం మాట తప్పారన్నారు. కరోనా ట్రీట్ మెంట్ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ధ్వజమెత్తారు. కరోనాను కంట్రోల్ చేయలేక.. కేంద్రంపై విమర్శలు చేసి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు.