ఎన్నికల్లో ఈసీ చీటింగ్!..కర్నాటకలోని ఓ నియోజకవర్గమే ఉదాహరణ: రాహుల్ గాంధీ

ఎన్నికల్లో ఈసీ చీటింగ్!..కర్నాటకలోని ఓ నియోజకవర్గమే ఉదాహరణ: రాహుల్ గాంధీ
  • 100% ఆధారాలు ఉన్నాయన్న లోక్ సభ ప్రతిపక్ష నేత 
  • ఖండించిన ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ:  ఎన్నికల సంఘం చీటింగ్​కు అనుమతిస్తున్నట్లు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. కర్నాటక లోక్​సభ ఎన్నికల్లో ఓ నియోజకవర్గమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. గురువారం పార్లమెంట్​ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘కర్నాటకలోని ఓ లోక్​సభ నియోజకవర్గంలో మేం పరిశీలించినప్పుడు భారీ అక్రమాలు బయటపడ్డాయి. అక్కడ అర్హత లేని వేల సంఖ్యలో కొత్త ఓటర్లను జాబితాలో ఈసీ చేర్చింది. ఇది పక్కా చీటింగ్​. దీనికి సంబంధించి 100 శాతం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. 

మహారాష్ట్రలో ఇలానే అక్రమాలకు పాల్పడ్డారు” అని దుయ్యబట్టారు. త్వరలో జరిగే బిహార్​ ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగే అవకాశం ఉందని, అందులో భాగంగానే  ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు అర్థమవుతున్నదని రాహుల్​ అన్నారు.

 రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ స్వతంత్రంగా పనిచేయడం లేదని, దేశంలో ఎన్నికలు చోరీకి గురవుతున్నాయని ఆరోపించారు. తాము వదిలిపెట్టబోమని రాహుల్ హెచ్చరించారు. దీనికి ఈసీ బదులిస్తూ.. రాహుల్​ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఓ ప్రకటనలో పేర్కొంది. 

‘‘కర్నాటకలోని సదరు నియోజకవర్గంలో అక్రమాలు జరిగి ఉంటే ఎన్నికలు జరిగిన 45 రోజుల్లో హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసే అవకాశం ఉంది. అలా పిటిషన్​ ఏమైనా ఉంటే చెప్పండి? నిరాధార  ఆరోపణలు చేయడం కరెక్ట్​ కాదు” అని తెలిపింది.