
న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళిని నీతి ఆయోగ్ ఉల్లంఘించలేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం చేసే జిల్లాల డేటాను ప్రధాని కార్యాలయానికి నీతి ఆయోగ్ ఇచ్చిందని, ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న కాంగ్రెస్, ఆప్ ఫిర్యాదును కొట్టివేసింది. కేంద్ర మంత్రులు అధికారిక పర్యటనలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయరాదని, అయితే ప్రధానికి మినహాయింపు ఉందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా చెప్పారు. 2014 అక్టోబర్ లోనే ఈ మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఇది ఒక్కసారి ఇచ్చే మినహాయింపు కాదని, స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్ అని ఆయన అన్నారు.
కాంగ్రెస్, ఆప్ ఆరోపణలపై ఈ నెల 4న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కు ఈసీ లేఖ రాసింది. నీతి ఆయోగ్ పొలిటికల్ డేటాను షేర్ చేయలేదని కేవలం జిల్లా స్థాయి డేటాను మాత్రమే షేర్ చేసిందని పీఎంవో వర్గాలు చెప్పాయి. బీజేపీ మేనిఫెస్టో కోసం డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అధికారిని స్టార్టప్ ఇండియా పై సమాచారం అడిగినట్లు కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసిందని, దీనిపై స్పందించాలని వాణిజ్య శాఖకు లేఖ రాసినట్లు సందీప్ సక్సేనా తెలిపారు.