హుజూర్‌‌నగర్‌‌లో కారుకు ‘ఖర్చు’ కష్టాలు

హుజూర్‌‌నగర్‌‌లో కారుకు ‘ఖర్చు’ కష్టాలు
  •     ప్రచారంలో ప్రతి పైసా లెక్కేస్తున్న అబ్జర్వర్‌‌ బాలకృష్ణన్‌‌
  •     కేటీఆర్‌‌ రోడ్‌‌ షో ఖర్చు రూ.12 లక్షలుగా అంచనా
  •     ఖర్చు తగ్గించుకుంటున్న అధికార పార్టీ నేతలు
  •     లిమిట్‌‌ దాటితే ఇబ్బంది అవుతుందని ఆందోళన

హైదరాబాద్, వెలుగుహుజూర్‌‌నగర్‌‌ ఉప ఎన్నికలో కారుకు ‘ఖర్చు’ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల అబ్జర్వర్‌‌ ముక్కుసూటిగా వ్యవహరిస్తుండటం, ప్రచార ఖర్చును కాస్త కూడా మిస్సవకుండా లెక్కేస్తుండటంతో అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిబంధనలకు మించి ఖర్చు ఎక్కడ ఎక్కువవుతుందోనని భయపడుతున్నారు. వీలైనంత వరకు వ్యయాన్ని తగ్గించుకుంటున్నారు.

వామ్మో బాలకృష్ణన్‌‌

1983 ఐఆర్ఎస్ బ్యాచ్‌‌కు చెందిన బాలకృష్ణన్‌‌కు ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరుంది. అయన బాధ్యతలు తీసుకుంది మొదలు పార్టీల వ్యయాలపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎట్లుందో ఆరా తీశారు. అధికార పార్టీ బాగా డబ్బు పంపిణీ చేస్తోందని, పోలీసుల సహకారంతోనే జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మహబూబ్‌‌నగర్ జిల్లా సీఐ ఒకరు సెలవు పెట్టి టీఆర్ఎస్‌‌కు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయన్ను డీజీపీ సస్పెండ్ చేశారు.

ఫొటోలు తీసుడు.. లెక్కలేసుడు

ఎన్నికల ప్రచారం కోసం టీఆర్‌‌ఎస్‌‌ సుమారు 60 మంది ఇంచార్జులను నియమించింది. వాళ్లకు సపోర్టుగా ఇద్దరు, ముగ్గురు అనుచరులు సొంత కార్లలో తిరుగుతున్నారు. మొత్తంగా 600లకు పైగా గులాబీ నేతల కార్లు హుజూర్‌‌నగర్‌‌లో హడావుడి చేస్తున్నాయి. రోజుకు ఒక్కో కారుకు 4 వేల చొప్పున ఆ కార్లకు ఈసీ లెక్క గట్టిందని తెలిసింది. దీంతో నేతలు ఆందోళనలో పడ్డారు. బస చేసే చోటే కార్లను వదిలి ప్రచారం కోసం కేటాయించిన కార్లలోనే పర్యటిస్తున్నారు. ప్రతి మండలంలో నాలుగైదు ప్రత్యేక టీంలను వ్యయ పరిశీలకుడు బాలకృష్ణన్ ఏర్పాటు చేశారని తెలిసింది. పార్టీ జెండాలతో ఏ వెహికల్‌‌ కనిపించినా వాళ్లు ఫొటో తీసి బాలకృష్ణన్‌‌కు నివేదిస్తున్నారు.

రద్దు చేస్తరని భయం!

అధికార పార్టీ అయి ఉండి హుజూర్‌‌నగర్ ఉప ఎన్నికలో ఏం చేయలేకపోతున్నామని ఎన్నికల ప్రచారంలో ఉన్న ఓ సీనియర్ నేత చెప్పారు. అన్ని రకాలుగా వనరులున్నా కష్టమవుతోందని, నిబంధనలకు మించి ఒక్క పైసా ఖర్చు చేసినా ఎన్నిక రద్దు చేసే పరిస్థితి నెలకొందని అన్నారు. ‘జయలలిత మరణంతో తమిళనాడు ఆర్కేనగర్‌‌కు బై ఎలక్షన్ జరిగింది. అప్పుడు విపరీతంగా డబ్బు ఖర్చు చేశారని నిర్ణయించిన ఈసీ వెంటనే ఎన్నిక రద్దు చేసింది. ప్రస్తుతం హుజూర్‌‌నగర్‌‌లోనూ అలాంటి పరిస్థితే ఉందని ‘ప్రగతిభవన్‌‌’కు దగ్గరగా ఉండే ఓ ఎమ్మెల్సీ అన్నారు. చిన్న తప్పు జరిగినా ఈసీ సీరియసయ్యే ప్రమాదం ఉందన్నారు.

ఆ ఎమ్మెల్సీపై ఈసీ నజర్‌‌

ఉపఎన్నిక కోసం టీఆర్‌‌ఎస్‌‌ నియమించిన 60 మంది ఇంచార్జులను ఓ ఎమ్మెల్సీ తన ఇంటికి పిలిచి ఒక్కొక్కరికీ భారీగా డబ్బిచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి సైదిరెడ్డి కూడా విపరీతంగా ఖర్చు చేస్తున్నారని కంప్లైంట్‌‌ చేశాయి. దీంతో ఆ ఎమ్మెల్సీ కదలికలు, ఆయన సంస్థలపై ఈసీ నిఘా పెట్టిందని తెలిసింది. సైదిరెడ్డి నామినేషన్ వేయకముందు హడావుడి చేసిన ఆ ఎమ్మెల్సీ ప్రచారంలో పెద్దగా కనిపించట్లేదని చర్చ జరుగుతోంది

కేటీఆర్‌‌ రోడ్‌‌ షోలు అందుకే క్యాన్సిల్‌‌?

ఎన్నికల అభ్యర్థులందరిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రచారానికి ప్రతి అభ్యర్థి ఎన్ని వెహికల్స్‌‌ వాడుతున్నారో పూసగుచ్చినట్టు లెక్కగడుతోంది. పార్టీ జెండాలతో సైకిల్, బైక్ కనిపించినా ఈసీ ప్రత్యేక టీం కెమెరాలో బంధిస్తోంది. ఈ నెల 4న కేటీఆర్ హుజూర్‌‌నగర్‌‌లో రోడ్ షో నిర్వహించారు. రోడ్‌‌ షోలో వందలాది వెహికల్స్‌‌ను వాడారు. భారీ సౌండ్ సిస్టమూ ఏర్పాటు చేశారు. ఆ రోడ్‌‌ షో వరకే సైదిరెడ్డి ఎన్నికల ఖర్చు 70 శాతం వరకు చేరిందని ఆయన్ను ఈసీ అలర్ట్ చేసినట్టు తెలిసింది. కేటీఆర్ రోడ్‌‌ షో ఖర్చే రూ. 12 లక్షలుగా లెక్కేసినట్టు సమాచారం. దీంతో తర్వాతి రోడ్‌‌ షోలను కేటీఆర్‌‌ క్యాన్సిల్‌‌ చేసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండకపోవచ్చని పార్టీలోని ఓ సీనియర్ నేత చెప్పారు. జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ. 28 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. పార్టీలు ఎంతమేరకైనా ఖర్చు చేసే వెసులు బాటుంది. బై ఎలక్షన్‌‌లో మాత్రం పార్టీ చేసే ఖర్చు కూడా అభ్యర్థి ఖర్చు పరిధిలోకి వస్తుంది.