అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత.. మళ్లీ డీజీపీగా నియమిస్తారా..?

అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత.. మళ్లీ డీజీపీగా నియమిస్తారా..?

తెలంగాణకు చెందిన ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజనీకుమార్‌ ఉన్నారు. ఫలితాలు వెలువడుతున్నప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి (ప్రస్తుతం ముఖ్యమంత్రి)ని వెళ్లి కలిశారు. 

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆయన.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్‌రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది. 

అసలేం జరిగిందంటే..

నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. పూర్తిస్థాయిలో కౌంటింగ్ పూర్తికాకముందే తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ మధ్యాహ్నం సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ తో రేవంత్ వద్దకు వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాకముందే డీజీపీ హోదాలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకరంగా కలవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీగా ఉన్న అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటువేసింది. మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

అంజనీకుమార్ స్థానంలో రవిగుప్తాను డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్ పై ఈసీకి అంజనీకుమార్ వివరణ ఇవ్వడంతో పాటు.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఈసీ సస్పెన్షన్ ఎత్తివేసింది.