
- ప్రణాళికలు రెడీ చేసుకుని.. సమన్వయంతో ముందుకెళ్లండి
- ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో ఈసీ బృందం
హైదరాబాద్, వెలుగు: ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకోవాల్సిందేనని ఈసీ బృందం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ముగిసిన అనంతరం.. ఈసీ ప్రతినిధులు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణా చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ధనం, మద్య ప్రవాహం ఎక్కువేనని.. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో చూస్తే ఆ విషయం తెలిసిపోతుందని ఈసీ బృందం అన్నట్లు తెలిసింది. ఓటర్లకు గాలం వేసే పద్ధతులన్నింటినీ పూర్తిగా కట్టడి చేయాల్సిన బాధ్యతన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల మీదనే ఉందని తెలిపింది.
పోలీసుల చెక్‌పోస్టులు, అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెకింగ్ పాయింట్లు మాత్రమే కాకుండా మిగిలిన అన్ని ఏజెన్సీలు ఒకరితో మరొకరు సమన్వయం చేసుకుని పనిచేస్తే డబ్బు రవాణాను అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందని ఈసీ వివరించింది. ఈ సందర్భంగా ఒక్కో ఏజెన్సీ ఎన్నికల్లో ఏ రకంగా పనిచేస్తారనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ), రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ), డైరెక్టరేట్‌ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు(ఎన్‌సీబీ), కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ విభాగాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), విదేశీ వ్యవహారాల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోర్ట్స్, రవాణా తదితర శాఖల అధికారులకు ఈసీ బృందం దిశానిర్దేశం చేసింది.
ఓటర్ల జాబితా, ఈవీఎంలు రెడీ: సీఈవో
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన తుది ఓటర్ల జాబితా రెడీ అయినట్లు సీఈవో వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. ఐదో తేదీ సాయంత్రం ఓటర్ల తుది జాబితాను ప్రకటించేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. అదే సమయంలో ఈవీఎంలు ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయినట్లు పవర్పాయింట్ప్రజేంటేషన్ లో తెలిపారు. బ్యాలెట్‌యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల కొరత ఏమి లేదని.. ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీలో ఉంటే సమయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా అధికారుల బదిలీలు పూర్తయ్యాయని.. శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఈసీ ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించనుంది.