జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ బై ఎలక్షన్‌‌‌‌‌‌‌‌కు ఈసీ అబ్జర్వర్లు

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ బై ఎలక్షన్‌‌‌‌‌‌‌‌కు ఈసీ అబ్జర్వర్లు

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో సహా 8 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కోసం మొత్తం 470 మంది సీనియర్ అధికారులను అబ్జర్వర్లుగా నియమించినట్లు తెలిపింది.

 ఈ పరిశీలకుల్లో 320 మంది ఐఎఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్ఎస్/ఐఆర్ఎఎస్/ఐసీఎఎస్ తదితర డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు చెందిన వారు ఉన్నారు. వీరు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసు పరిశీలకులు వ్యవహరించగా, అభ్యర్థులు ఖర్చు చేసే ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు ఎక్స్పెండిచర్‌‌‌‌‌‌‌‌ పరిశీలకులను నియమించామని ఈసీ వెల్లడించింది.

 అలాగే, కేంద్ర పరిశీలకులు ఎన్నికల సంఘానికి సమయానుకూలంగా నివేదికలు పంపుతారని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఓటర్లకు అవగాహన కార్యక్రమాల్లో కూడా వారు , పాల్గొంటారని తెలిపింది. కాగా.. తెలంగాణ (జూబ్లీహిల్స్), జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ (బడ్గామ్‌‌‌‌‌‌‌‌, నాగ్రోటా), రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ (ఆంటా), జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ (ఘాట్షిలా), పంజాబ్‌‌‌‌‌‌‌‌ (తర్న్ తారన్‌‌‌‌‌‌‌‌), మిజోరాం (డంపా), ఒడిశా (నౌపాడా)లో జరగనున్న ఉప ఎన్నికల్లో కూడా ఈ పరిశీలకులను నియమించినట్లు ఈసీఐ వెల్లడించింది.