చిన్నపిల్లలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి.. ఈసీ వార్నింగ్

చిన్నపిల్లలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి.. ఈసీ వార్నింగ్

ఢిల్లీ: కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్రక‌ట‌న జారీ చేసింది. పొలిటికల్​పార్టీల‌కు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. మైనర్ బాలురు/బాలికలతో ఎన్నికల ప్రచారం చేసే రాజకీయ పార్టీలు గానీ, వాటి తరఫున పోటీ చేసే అభ్యర్థులపై గానీ కఠిన చర్యలను తీసుకుంటామని తెలిపింది.  ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్ షో, ఇంటింటికీ తిరగడం, తమకు అనుకూలంగా నినాదాలు చేయడం, పోస్టర్లు, పాంప్లెట్లను పంచడం.. వంటి ప్రచారాలు లేదా దానికి సంబంధించిన కార్యక్రమాల్లో చిన్న పిల్లలను దూరంగా ఉంచాలని సూచించింది.

 తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభ్యర్థులు పిల్లలను ఎత్తుకోవడం, తమ వాహనాల్లో తిప్పడాన్ని కూడా నిషేధించినట్లు ఈసీ తెలిపింది. బాల కార్మికుల నిషేధ సవరణ చట్టం 2016 కిందికి.. ఆయా చర్యలన్నీ శిక్షార్హమైనవని వివరించింది. దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లకు అప్పగించింది. దీన్ని ఉల్లంఘించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలను తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఈసీ జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ ఉత్తర్వులు జారీ చేశారు.