అనంతగిరి గుట్టలో 213 ఎకరాల్లో ఎకో టూరిజం

అనంతగిరి గుట్టలో 213 ఎకరాల్లో ఎకో టూరిజం
  • అధికారులను ఆదేశించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌‌ నారాయణ రెడ్డి 

వికారాబాద్, వెలుగు : అనంతగిరి గుట్టను 213 ఎకరాల్లో ఎకో టూరిజం కింద అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.  గురువారం కలెక్టర్‌‌ కార్యాలయంలోని అధికారులు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో ఎకో టూరిజం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  అనంతగిరి అభివృద్ధి కోసం 213 ఎకరాల విస్తీర్ణంలో పనులు చేపట్టాలన్నారు. ఇందులో కాటేజీలు, రోడ్లు, పార్కింగ్, కన్వెన్షన్ సెంటర్, ట్రాకింగ్ పాయింట్, అడ్వెంచర్‌‌ టూరిజం లాంటి ఏర్పాట్లు చేయనున్నామని ఆయన తెలిపారు. అనంతగిరి పద్మనాభస్వామి దేవస్థానం, కోటిపల్లి ప్రాజెక్టుతో సమానంగా సర్పన్ పల్లి ప్రాజెక్టును కూడా టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.  

హైదరాబాద్ నుంచి అనంతగిరి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు.  రోజుకు కనీసం 5 వేల మంది పర్యాటకులు సందర్శించవచ్చని చెప్పారు. వెయ్యి మంది వరకు రాత్రిపూట బస చేసే అవకాశం ఉన్నందున, దీనికి తగ్గట్టుగా పార్కింగ్ తో పాటు అవసరమైన మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ లాంటి అన్ని సదుపాయాలు కల్పించేలా పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఈ  సమావేశంలో డీఎఫ్ఓ  జ్ఞానేశ్వర్, టూరిజం అధికారి హనుమంతరావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ చలమారెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి మాధవిలతో పాటు ఎల్అండ్‌టీ ప్రాజెక్టు మేనేజర్ సుమలత పాల్గొన్నారు.