కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి.. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత మధ్యంతర బెయిల్ పై మే 28వ తేదీ మంగళవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు. మే 27వ తేదీ సోమవారం కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.  ఈ రోజు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించాయి. 

"ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్. ఈ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరింది. దీనికి సంబంధించిన వాట్సప్ చాటింగ్స్ మా వద్ద ఉన్నాయి. ఇండియా హెడ్ ఛానల్ లో పెట్టుబడి పెట్టారు. ఫోన్ లో డేటాను ధ్వంసం చేశారు. విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు. ఈడీకి ఇచ్చిన ఫోన్ లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.  డిజిటల్ డేటా ధ్వంసంపై  పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దు. సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం. ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు. గోప్యత హక్కును భంగపరచలేదు" అని ఈడీ తరపున న్యాయవాది జోహెబ్ హుసేన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు.

"నిబంధనలను పాటిస్తూ చట్ట ప్రకారమే కవిత అరెస్ట్ జరిగింది. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉంది. లిక్కర్  పాలసీ ద్వారా కవిత లబ్ది పొందారు.  కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది.ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. కవితకు బెయిల్ ఇవ్వడానికి మెడికల్ కారణాలు కూడా లేవు" అని సీబీఐ వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది.