బెట్టింగ్ యాప్స్‌‌‌‌ కేసులో 110 కోట్లు ఫ్రీజ్‌‌‌‌

బెట్టింగ్ యాప్స్‌‌‌‌ కేసులో 110 కోట్లు ఫ్రీజ్‌‌‌‌
  • రూ.2,000 కోట్లు మనీ లాండరింగ్‌‌‌‌ జరిగినట్లు గుర్తింపు
  • హైదరాబాద్, ముంబయి సహా 17 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్, వెలుగు: పారిమ్యాచ్‌‌‌‌  ఆన్‌‌‌‌లైన్  బెట్టింగ్‌‌‌‌  యాప్‌‌‌‌  కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌  డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) రూ.110  కోట్లు ఫ్రీజ్  చేసింది.  బెట్టింగ్‌‌‌‌లో కొల్లగొట్టిన డబ్బు డిపాజిట్‌‌‌‌ అయిన మ్యూల్‌‌‌‌ అకౌంట్లను కూడా ఫ్రీజ్  చేసింది. పారిమ్యాచ్‌‌‌‌  బెట్టింగ్ యాప్‌‌‌‌పై ముంబయి సైబర్  పోలీస్ స్టేషన్‌‌‌‌లో నమోదైన  ఎఫ్‌‌‌‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ముంబయి సహా హైదరాబాద్‌‌‌‌, ఢిల్లీ, నోయిడా, జైపూర్,‌‌‌‌ మదురై, సూరత్‌‌‌‌, కాన్పూర్‌‌‌‌లోని  మొత్తం 17 ప్రాంతాల్లో మంగళవారం సోదాలు జరిపిన విషయం తెలిసిందే.

 సోదాల వివరాలను అధికారులు  గురువారం వెల్లడించారు. రూ.110 కోట్లను ఫ్రీజ్  చేయడంతో పాటు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన డిజిటల్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మ్యూల్‌‌‌‌  అకౌంట్లలో డిపాజిట్  అయిన రూ.2000  కోట్ల క్రిప్టో కరెన్సీ రూపంలో  దేశం దాటించినట్లు ఆధారాలు సేకరించామని చెప్పారు. తమిళనాడులోని ఏటీఎంలు, యూపీఐల ద్వారా నగదు విత్‌‌‌‌డ్రా చేయగా.. హైదరాబాద్‌‌‌‌కు చెందిన కొందరు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌  అగ్రిగేటర్లు, డొమెస్టిక్  మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్ ఏ జెంట్లు పెద్ద మొత్తంలో క్రిప్టో, హవాలా రూపంలో తరలించినట్లు గుర్తించారు. ఈ మొత్తం కుంభకోణంలో మ్యూల్‌‌‌‌ అకౌంట్లు, పేమెంట్‌‌‌‌  ఏజెంట్ల వివరాల ఆధారంగా సోదాలు నిర్వహించారు.