ఢిల్లీ సీబీఐ స్పెషల్ కోర్టులో ‘సప్లిమెంటరీ’ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ సీబీఐ స్పెషల్ కోర్టులో ‘సప్లిమెంటరీ’ దాఖలు చేసిన ఈడీ
  • 11 మంది నిందితులు, నాలుగు సంస్థల పేర్ల ప్రస్తావన
  • రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై చార్జ్‌‌షీట్‌‌లో క్లారిటీ
  • డబ్బు ఎవరి నుంచి ఎవరికి మళ్లించారనే దానిపై సాక్ష్యాల సేకరణ
  • సౌత్ గ్రూప్‌‌లో కీలకంగా వ్యవహరించిన వారిపై డీటైల్డ్ ఎంక్వైరీ
  • నిందితులపై ప్రత్యేకంగా రిపోర్టులు తయారు చేసిన ఆఫీసర్లు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ప్రివెన్షన్ ఆఫ్​ మనీల్యాండరింగ్ యాక్ట్ సెక్షన్ల కింద 13,567 పేజీల సప్లిమెంటరీ చార్జ్‌‌షీట్‌‌ను శుక్రవారం ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టులో దాఖలు చేసింది. ఇందులో మొత్తం 11 మంది పేర్లను పేర్కొంది. అలాగే ఈ చార్జ్‌‌షీట్‌‌ను పూర్తిగా చదవడానికి ముందు 428 పేజీల సారాంశంతో కూడిన సమాచారాన్ని జడ్జికి సమర్పించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, బినోయ్ బాబు, అమిత్ అరోరా పేర్లను ఈ సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌లో పొందుపరిచింది. ఇటీవల సీబీఐ స్పెషల్ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందిన ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్‌‌, వ్యాపారవేత్తలు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, ఈ కేసులో అప్రూవర్‌‌‌‌గా మారిన దినేశ్ అరోరా పేర్లతోపాటు సమీర్ మహేంద్రుకు చెందిన నాలుగు కంపెనీలను కూడా చార్జ్‌‌షీట్‌‌లో పేర్కొంది. ఈ కేసు వ్యవహారంలో నిందితులపై ప్రత్యేకంగా కొన్ని రిపోర్టులు తయారు చేసినట్లు ఈడీ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇండో స్పిరిట్ వ్యాపారి సమీర్ మహేంద్రును ఏ1గా చేర్చుతూ గతేడాది నవంబర్ 26 న 3 వేల పేజీలతో ఈడీ తొలి చార్జ్‌‌షీట్‌‌ను దాఖలు చేసింది. ఇందులోనే ఎమ్మెల్సీ కవితకు సౌత్ గ్రూప్, లిక్కర్ స్కామ్‌‌తో ఉన్న సంబంధాలను వెల్లడించింది. ఏ1 గా ఉన్న సమీర్ మహీంద్రుతోపాటు సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించిన వారిపై ఈడీ డీటైల్డ్ ఎంక్వైరీ చేసి వాటి ఆధారంగానే ఫస్ట్ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో మిస్ అయిన పలు అంశాలకు సంబంధించిన ఎవిడెన్స్‌‌‌‌ను సమకూర్చుకున్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు.

హవాలా రూపంలో డబ్బు మళ్లింపు

ఇటీవల విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌‌‌‌ల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. ముడుపుల వ్యవ హారంలో కీలక సాక్ష్యాలను సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్ల ద్వారా 2 రోజుల్లో సమర్పిస్తామని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్‌‌‌‌పాల్‌‌‌‌కు ఈడీ తెలిపింది. నాడు వాదనలు వినిపించిన విజయ్ నాయర్ తరఫు సీనియర్ అడ్వొకేట్.. పసలేని అంశాలతో ఈడీ చార్జ్‌‌‌‌షీట్ దాఖలు చేసింద ని ఆరోపించారు. వంద కోట్ల ముడుపుల వ్యవహారం, నిధుల పంపిణీ ఎక్కడి నుంచి జరిగిందనే అంశాలపై క్లారిటీ లేదన్నారు. ఈ వాదనలకు సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో సమాధానం దొరుకుతుందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. నిందితులు, మనీ ట్రాన్స్ ఫర్లపై క్లారిటీ వస్తుందని పేర్కొంటున్నాయి. స్కామ్‌‌‌‌లో పాత్రధారులు, సూత్రధారులు ఢిల్లీ, హైదరాబాద్‌‌‌‌లో బస చేసిన వివరాలు, ప్రత్యేక విమానాల్లో చేసిన ప్రయాణాల గురించి పొందుపరిచినట్లు తెలిసింది. అలాగే వంద కోట్లు ఎవరి నుంచి ఎవరి అకౌంట్‌‌‌‌లోకి మళ్లించారనే సాక్ష్యాలు చార్జ్ షీట్‌‌‌‌లో ఉంటాయని తెలిసింది. హోల్‌‌‌‌సేల్ వ్యాపారంలో 12 శాతం లాభాలు, రిటైల్ వ్యాపారంలో 185 శాతం లాభాలు వచ్చేలా లిక్కర్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగిన తీరును పేర్కొంది. ఇందుకోసం హవాలా రూపంలో డబ్బు మళ్లించిన దానికి సంబంధించిన ఆధారాలను పొందుపరిచినట్లు తెలిసింది. ఈ సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ను ముందుగా జడ్జి పరిశీలిస్తారు. ఆ తర్వాత దాన్ని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా అనేది తెలియనుంది.

ఇయ్యాల శరత్ చంద్రా రెడ్డి బెయిల్​పై విచారణ

విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబుకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ శనివారంతో ముగియనుంది. వీరందరినీ ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచనున్నారు. బెయిల్ పిటిషన్ కోసం శరత్ చంద్రా రెడ్డి వేసిన పిటిషన్ కూడా శనివారం సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్ ముందుకు రానుంది. శరత్ చంద్రా రెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. ఈ విచారణ సందర్భంగా సప్లమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసిన అంశాన్ని కోర్టు దృష్టికి ఈడీ తీసుకెళ్లనుంది.