సాహితీ ఇన్‌‌‌‌ఫ్రా కేసు.. ఎండీ, సేల్స్ హెడ్ పై ఈడీ చార్జిషీట్‌‌‌‌

సాహితీ ఇన్‌‌‌‌ఫ్రా కేసు.. ఎండీ, సేల్స్ హెడ్ పై ఈడీ చార్జిషీట్‌‌‌‌
  • ప్రీలాంచ్ ప్రాజెక్టు పేరుతో 700 మంది నుంచి రూ.వెయ్యి కోట్లు వసూలు
  • ప్లాట్లు అప్పగించకుండా రూ.360 కోట్లు మోసం

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: సాహితీ ఇన్‌‌‌‌ఫ్రాటెక్  వెంచర్స్  ఇండియా ప్రైవేట్  లిమిటెడ్  కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌  డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ).. చార్జిషీటు దాఖలు చేసింది. ప్రీలాంచ్‌‌‌‌  పేరుతో మనీ లాండరింగ్‌‌‌‌కు పాల్పడిన సంస్థ మాజీ డైరెక్టర్  బి.లక్ష్మీనారాయణ, సేల్స్  అండ్‌‌‌‌  మార్కెటింగ్  హెడ్‌‌‌‌  సాండూ పూర్ణచంద్రరావుపై అభియోగాలు మోపింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌  ఎంఎస్‌‌‌‌జే కోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది.

ఈ వివరాలను హైదరాబాద్  ఈడీ జోనల్  కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ప్రపంచ స్థాయి గేటెడ్  కమ్యూనిటీ నిర్మిస్తున్నామంటూ సాహితీ ఇన్ ఫ్రాటెక్.. ప్రీ-లాంచ్  ఆఫర్  చేసింది. డిపాజిటర్లకు అతి తక్కువ సమయంలోనే ఫ్లాట్లు, విల్లాలు అప్పగిస్తామని నమ్మించి 700 మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. అయితే గడువులోగా ఫ్లాట్లను అప్పగించలేదు. 

డబ్బులు కూడా తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు హైదరాబాద్‌‌‌‌  సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌‌‌‌ (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్  పోలీసుల ఎఫ్‌‌‌‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. సాహితీ ప్రాజెక్టు పేరున కొనుగోలుదారుల నుంచి రూ. 800 కోట్లు, సర్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌‌‌‌లో ఇన్వెంటరీ అమ్మకం పేరున మరో రూ. 216.91 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

 ఈ డబ్బును లక్ష్మీనారాయణ సహా ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న విదేశీ ఖాతాలకు మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో రూ.360 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో సాండూ పూర్ణచంద్రరావు సుమారు రూ. 126 కోట్లను దారిమళ్లించాడు.

 ఇందులో రూ.50 కోట్లకు పైగా నగదు రూపంలో తీసుకున్నాడు. ఫోరెన్సిక్  ఆడిట్  తర్వాత ఈ విషయం లక్ష్మీనారాయణ గుర్తించాడు. ఈ మేరకు పూర్ణచంద్రరావుపై మూడు ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదయ్యాయి. ఈ కేసులో రూ.169.15 కోట్ల విలువైన స్థిరచరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.