- రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు నిర్మించినం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
- హుజూర్‌నగర్‌లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణాలు ప్రారంభం
హుజూర్ నగర్, వెలుగు: రాష్ట్రంలో ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణాలను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పొంగులేటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.
బీఆర్ఎస్ కాళేశ్వరం కడితే కమీషన్లు వస్తాయని ఆలోచించిందే తప్ప పేదలకు ఇండ్లు కట్టించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున ఇప్పటివరకు 4 లక్షల50 వేల ఇండ్లు నిర్మించామన్నారు.
ఏటా రెండు విడతలుగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇల్లు ఇస్తున్నామన్నారు. లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. అదనంగా ఇండ్లు కేటాయించాలని గతంలో గృహజ్యోతి కింద మంజూరైన ఇండ్లను కూడా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని, ఆ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. మార్చి 31 నాటికి కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మన నీటి హక్కులు సాధిస్తం: ఉత్తమ్
కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం వద్ద వాదనలు వినిపించి తెలంగాణ నీటి వాటాలను, హక్కులను సాధిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2012 లో తాను హౌజింగ్మినిస్టర్గా ఉన్నప్పుడు హుజూర్ నగర్ మోడల్ కాలనీ మంజూరు చేశానని, ప్రభుత్వ భూమి లేకపోవడంతో హైకోర్టు అనుమతితో 115 ఎకరాల దేవాదాయ భూమిని సేకరించి పనులు ప్రారంభించామని తెలిపారు.
తనపై కక్షతో బీఆర్ఎస్ తమ పాలనలో పదేండ్లు పనులను ఆపేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నిర్మాణాలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, హౌజింగ్ సెక్రటరీ గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో: పొంగులేటి
వరంగల్/హనుమకొండ, వెలుగు: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలే అని, ఆ పార్టీ నేత కేటీఆర్ ముందుగా తన ఇంటి సమస్యలు చక్కబెట్టుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఇనగాల వెంకటరామిరెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరిగి అధికారంలోకి వస్తామని కేటీఆర్ జనగామలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జూబ్లీహిల్స్ తమకు రెఫరెండమని చెప్పి బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. మళ్లీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు సెమీఫైనల్ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
