సెలబ్రిటీల 'క్రైమ్ స్టోరీ'పై ఈడీ ఛార్జిషీట్!.. వేల కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌లో షాకింగ్ విషయాలు బయటికి!

సెలబ్రిటీల 'క్రైమ్ స్టోరీ'పై ఈడీ ఛార్జిషీట్!.. వేల కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌లో షాకింగ్ విషయాలు బయటికి!

ఒకప్పుడు సెలబ్రెటీలుగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా పేర్లు వార్తల్లో తరచూ వినిపించేవి. కానీ ఇటీవల వారి క్రైమ్ స్టోరీలు ఒక్కొక్కటి బయటపడటంతో వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక నేరాల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో తమ హోటల్ వ్యాపారాన్ని కూడా క్లోజ్ చేశారు. ఈ జంట  మరోసారి మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. లేటెస్ట్ గా ఈ జంటపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. 

దేశంలో సంచలనం సృష్టించిన బిట్‌కాయిన్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై ప్రత్యేక పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. కుంద్రా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని, సుమారు రూ.150.47 కోట్ల విలువైన 285 బిట్‌కాయిన్‌లకు ఆయనే అసలు లబ్ధిదారుడని ఈడీ ఆరోపించింది.

అసలు స్కామ్ ఏమిటి?

ఈ మనీలాండరింగ్ కేసు మూలాలు 2017-18లో నాటి బిట్‌కాయిన్ స్కామ్‌లో ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే దివంగత క్రిప్టో స్కామ్ మాస్టర్‌మైండ్ అమిత్ భరద్వాజ్, అతని సోదరులు అజయ్, వివేక్ భరద్వాజ్, సింపీ, మహేందర్ భరద్వాజ్‌లపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల నుంచి ఈ కేసు మొదలైంది.

ప్రమోటర్లు బిట్‌కాయిన్ మైనింగ్ ద్వారా పెట్టుబడిదారులకు భారీ రాబడిని ఇస్తామని నమ్మబలికారు. నెలవారీ 10 శాతం వరకు రిటర్న్స్ ఇస్తామని ఆశ చూపారు. అయితే, వాస్తవానికి పెట్టుబడిదారులను మోసం చేసి, అక్రమంగా సంపాదించిన బిట్‌కాయిన్‌లను అస్పష్టమైన ఆన్‌లైన్ వాలెట్లలో దాచిపెట్టారని ఈడీ పేర్కొంది. ఈ విధంగా వారు సుమారు వేల కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాజ్ కుంద్రాపై ఈడీ ఆరోపణలు

రాజ్ కుంద్రా ఈ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించారని ఈడీ తమ ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది. బిట్‌కాయిన్ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుండి కుంద్రా 285 బిట్‌కాయిన్‌లను అందుకున్నారని ఆరోపణ. ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు కోసం కుంద్రాకు ఈ బిట్‌కాయిన్‌లు ఇచ్చారని, అయితే ఆ ఒప్పందం కార్యరూపం దాల్చకపోయినా, కుంద్రా ఆ బిట్‌కాయిన్‌లను తన వద్దే ఉంచుకున్నారని ఈడీ తెలిపింది. కుంద్రా కేవలం తాను మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించానని వాదించినప్పటికీ.. ఈ ఒప్పందం వాస్తవానికి రాజ్ కుంద్రా, అమిత్ భరద్వాజ్ (మహేందర్ భరద్వాజ్) మధ్యనే జరిగింది. ఆయన మధ్యవర్తి అనే వాదన నమ్మశక్యం కాదు అని ఛార్జిషీట్‌లో పేర్కొంది.

సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నం?

కుంద్రా ఉద్దేశపూర్వకంగా కీలక సాక్ష్యాలను దాచిపెట్టారని ఈడీ ఆరోపిస్తోంది. 285 బిట్‌కాయిన్‌లను బదిలీ చేసిన వాలెట్ చిరునామాలను 2018 నుంచి ఇప్పటివరకు అందించడంలో ఆయన విఫలమయ్యారు. తన ఐఫోన్ ఎక్స్ (iPhone X) దెబ్బతిన్నందున ఆ వివరాలు లేవని కుంద్రా చెప్పగా, ఈడీ దానిని సాక్ష్యాలను నాశనం చేసేందుకు చేసిన ప్రయత్నంగా భావించింది.

శిల్పాశెట్టితో లావాదేవీపై అనుమానాలు

కుంద్రా అక్రమ కార్యకలాపాల ద్వారా సంపాదించిన నిధులను చట్టబద్ధమైనవిగా చూపించేందుకు ప్రయత్నించారని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే, తన భార్య, నటి శిల్పాశెట్టితో మార్కెట్ ధర కంటే తక్కువకు ఒక నిజమైన లావాదేవీ చేశారని, తద్వారా నేర కార్యకలాపాల నుండి వచ్చిన నిధుల మూలాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారని ఈడీ పేర్కొంది. నేర కార్యాకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దారి మల్లించి వాటిని వైట్ మనీగా చూపించే ప్రయత్నాలను ఈడీ దర్యాప్తులో బయటపడ్డాయి. కుంద్రా, శిల్పాశెట్టి దంపతులు ఈడీ నోటీసులపై గతంలో కోర్టులో స్టే పొందారు, అయితే ఈ తాజా ఛార్జిషీట్ మరోసారి ఈ కేసును కీలక మలుపు తిప్పింది. ఈ హై-ప్రొఫైల్ కేసులో రాజ్ కుంద్రా తనపై వచ్చిన ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారు, న్యాయస్థానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.