హైదరాబాద్‌‌ కేంద్రంగా రిజిస్టరైన 2 డిస్టిలరీ కంపెనీలపై ఫోకస్

హైదరాబాద్‌‌ కేంద్రంగా రిజిస్టరైన 2 డిస్టిలరీ కంపెనీలపై ఫోకస్

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారాలపై దృష్టిపెట్టింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌ ఆధారంగా మంగళవారం దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ.. ఈ  కేసులో డొల్ల కంపెనీల నుంచే అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా ఆధారాలు సేకరించిందని తెలిసింది. సోదాల్లో భాగంగా అరుణ్ రామచంద్ర పిళ్లై డైరెక్టర్​గా హైదరాబాద్​లో రిజిస్టరైన 2కంపెనీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తోంది. కోకాపేట్‌‌, బెంగళూర్‌‌‌‌లోని ఆయన ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ తనిఖీలు చేసింది.

లిక్కర్‌‌ స్కామ్‌‌లో ఢిల్లీకి చెందిన  సమీర్ మహేంద్రు పిళ్లై కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ తన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లో పేర్కొంది. పిళ్లై మీడియేటర్లు అరుణ్ పాండ్య, విజయ్‌‌ నాయర్‌‌ల నుంచి సమీర్​కు‌‌ విడతల వారీగా రూ.4 కోట్లు అందినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం డొల్ల కంపెనీల నుంచే చేతులు మారినట్లు ఆధారాలు సేకరించిందని సమాచారం. ఈ ట్రాన్జాక్షన్లపై వివరణ ఇవ్వాలని పిళ్లైకి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.   

షెల్ కంపెనీలతో దందా..

హైదరాబాద్‌‌ కేంద్రంగా రిజిస్టరైన 2డిస్టిలరీ కంపెనీలపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌‌లో రిజిస్టరైన 3కంపెనీలకు పిళ్లై డైరెక్టర్‌‌‌‌ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. డిస్టిలరీ కంపెనీల పేరుతో నిర్వహిస్తున్న టెండర్లలో రాష్ట్రం నుంచి ఈ 2కంపెనీలే ఎక్కువ కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఢిల్లీ కేంద్రంగా రిజిస్టరైన ఇండో స్పిరిట్‌‌ కంపెనీ ఎండీ పిళ్లైకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలించినట్లు తెలిసింది. లైసెన్స్‌‌ హోల్డర్లు, డిస్టిలరీ కంపెనీలకు మేలు జరిగే విధంగా అవినీతి జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇందుకే నిబంధనలను ఉల్లంఘించి పాలసీ రూపొందించారని ఆధారాలు సేకరించింది.