
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇవాళ తలసాని సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను విచారిస్తున్న ఈడీ.. లేటెస్ట్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ లకు నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని వారికి తెలిపినట్లు సమాచారం. మనీ లాండరింగ్, క్యాసినో కేసులలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తలసాని సోదరులను మధ్యాహ్నం నుంచి విచారిస్తున్నారు. వారి నుంచి మనీ లాండరింగ్, క్యాసినో కేసుకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌తో పాటు ఆయన సన్నిహితులను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. అంతకు ముందు చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరైన చీకోటి.. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు చెప్పారు.