ఇండియా రావాల్సిందే :మెహుల్‌‌ చోక్సీ వినతిని తిరస్కరించిన ఈడీ

ఇండియా రావాల్సిందే :మెహుల్‌‌ చోక్సీ వినతిని తిరస్కరించిన ఈడీ

ఎయిర్ అంబులెన్స్ పంపడానికి సిద్ధమని  వెల్లడి

న్యూఢిల్లీ: పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌ (పీఎన్బీ)ను రూ.13,700 కోట్లకు మోసగించిన కేసులో తనను కరేబియన్ దేశం యాంటిగ్వాలో ప్రశ్నించాలన్న ఆభరణాల వ్యాపారి మెహుల్‌‌ చోక్సీ చేసిన విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఇదే కేసులో కీలక నిందితుడైన మరో నగల వ్యాపారి నీరవ్‌‌ మోదీకి చోక్సీ మేనమామ అనే విషయం తెలిసిందే. నీరవ్‌‌ లండన్‌‌కు పారిపోగా, చోక్సీ గత ఏడాది నుంచి యాంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగాలేనందున, ఇండియాకు రాలేను కాబట్టి యాంటిగ్వాలో ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. తను ఇక్కడ చికిత్స తీసుకుంటున్నానని కూడా ఈడీకి తెలిపాడు. సీబీఐ గత ఏడాది జనవరిలో పీఎన్బీ కుంభకోణాన్ని వెలికితీయగా, చోక్సీ 2017 డిసెంబరులోనే యాంటిగ్వా పౌరసత్వం సంపాదించాడు. విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అనారోగ్య కారణాల వల్ల ఇండియాకు రావడం సాధ్యం కాదని ముంబై హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌‌లో పేర్కొన్నాడు.

ఇందుకు ఈడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ చోక్సీ   యాంటిగ్వాకు పారిపోయాడని, అతనిపై రెడ్‌‌కార్నర్‌‌ నోటీసు కూడా జారీ అయిందని తెలిపారు. అతడు ‘పరారీలో ఉన్న నేరస్తుడు’ కాబట్టి పిటిషన్‌‌ను తిరస్కరించాలని కోరారు. ముద్దాయి విచారణకు ఎప్పుడూ సహకరించలేదని, ఇండియాకు రావాలనుకుంటే డాక్టర్లతో కూడిన ఎయిర్‌‌ అంబులెన్స్‌‌ను పంపిస్తామని కోర్టుకు తెలిపారు. ‘‘చోక్సీకి వ్యతిరేకంగా నాన్‌‌ బెయిలబుల్‌‌ వారంట్‌‌ జారీ అయింది. స్వదేశం రావడానికి తిరస్కరిస్తున్నాడు కాబట్టి పరారీలో ఉన్న నేరగాడి కిందే పరిగణించాలి. ఇండియాకు రావడానికి కోర్టు అతనికి నెలకు మించి గడువు ఇవ్వకూడదు. ఇప్పటి వరకు చోక్సీకి చెందిన రూ.6,129 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఈడీ.. కోర్టుకు వివరించింది. ప్రభుత్వం చేసుకున్న తన ఆస్తుల విలువ రూ.2,100 కోట్లు మాత్రమేనని చోక్సీ ప్రకటించాడు.   మోడీ, చోక్సీ ముంబైలోని బ్రాడీ హౌస్‌‌ పీఎన్బీ బ్రాంచ్‌‌ను రూ.13 వేల కోట్ల వరకు మోసగించిన కేసులో సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. లండన్‌‌కు పారిపోయిన నీరవ్‌‌ మోడీని ఇటీవలే అక్కడి అధికారులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టు ఇతనికి బెయిల్​ తిరస్కరించింది.