- ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట కస్టమర్లతో చీటింగ్
- రూ.60 కోట్లు వసూలు చేసిన కంపెనీ
- ఎనిమిది ప్రాంతాల్లో రెండు రోజులు తనిఖీలు
- డబ్బంతా షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: ప్రీ లాంచ్ స్కీమ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. జయత్రి ఎండీ కాకర్ల శ్రీనివాస్ ఇంటితో పాటు జనప్రియ గ్రూప్, రాజా డెవలపర్స్ అండ్ బిల్డర్స్, ఆర్కే రమేశ్, సత్యసాయి ట్రాన్స్‌పోర్ట్, గాయత్రి హోమ్స్, శివసాయి కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఉన్న షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన 8 ప్రాంతాల్లో 2 రోజుల పాటు సోదాలు చేసింది. ఇండ్లలోనే షెల్ కంపెనీలను రిజిస్టర్ చేసినట్లు గుర్తించింది.
ఈ సోదాల్లో డిజిటల్ డివైజెస్, ప్రీ లాంచ్ స్కీమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డిపాజిట్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జోనల్ ఈడీ ఆఫీస్ సోమవారం వివరాలను వెల్లడించింది.
గడువు ముగిసినా ఫ్లాట్లు అప్పగించలేదు
జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రీ-లాంచ్ స్కీమ్‌ల పేరుతో ఫ్లాట్లు విక్రయిస్తున్నట్లు ఆఫర్లు ప్రకటించింది. ఈ మేరకు కస్టమర్ల నుంచి సుమారు రూ.60 కోట్లు వసూలు చేసింది. గడువు ముగిసినా ఫ్లాట్లు అప్పగించలేదు. డబ్బూ వాపస్ ఇవ్వలేదు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ కమిషనరేట్ సహా పలు పోలీస్ స్టేషన్లతో కేసులు నమోదు అయ్యాయి. ఆయా ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. వసూలు చేసిన డబ్బులను వివిధ సంస్థలకు మళ్లించినట్లు తేలింది.
ఇందులో జనప్రియ గ్రూప్ సహా మరో ఆరో సంస్థల పేరుతో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది. సదరు కంపెనీలకు మనీలాండరింగ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. ప్రాపర్టీ డాక్యుమెంట్లు, ఎంవోయూలు, ప్రాజెక్ట్ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నది. ప్రాజెక్ట్ భూములను కొనుగోలుదారులకు కాకుండా థర్డ్ పార్టీలకు మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. ప్రధాన నిందితుడు కాకర్ల శ్రీనివాస్‌ను గతంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన శ్రీనివాస్.. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
