ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై ..దాడి చేసి కర్రలు, రాడ్లతో కొట్టి.. అమ్మాయిని కిడ్నాప్ చేసిన పేరెంట్స్

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై ..దాడి చేసి కర్రలు, రాడ్లతో  కొట్టి.. అమ్మాయిని కిడ్నాప్ చేసిన పేరెంట్స్

జగిత్యాల జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి కలకలం రేపుతోంది. కర్రలు, ఇనుప రాడ్లతో గుంపుగా వచ్చిన దుండగులు అబ్బాయి ఇంటిపై దాడి చేసి అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. అమ్మాయి పేరెంట్స్, బంధువులే కిడ్నాప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..  

జగిత్యాల జిల్లా మల్యాకు చెందిన నల్ల ముత్తుకుమార్ ( 27), ఏపీకి చెందిన  సోముల మాధవి ( 24) గత కొంత కాలం ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారం క్రితం కొండగట్టు అంజన్న సన్నిధి లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి మాధవి తల్లిదండ్రులు, బంధవులు ఒప్పుకోలేదు.దీంతో ముత్తుకుమార్, మాధవి మల్యాల పోలీసులను ఆశ్రయించగా కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా అమ్మాయి వర్గం బెదిరింపులు ఆపలేదు. 

సోమవారం(నవంబర్24) ఉదయం  మల్యాలలోని ముత్తుకుమార్ ఇంటికి వచ్చిన మాధవి పేరెంట్స్, బంధువులు ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేశారు. అమ్మాయి బంధువులు ముత్తు ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసి కట్టెలతో తీవ్రంగా కొట్టినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు చెప్పారు. 

గాయపడిన  ముత్తుకుమార్ కుటుంబ సభ్యులకు జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమ్మాయి పేరెంట్స్, బంధువులనుంచి తమకు ప్రాణహాని ఉందని, మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని బాధితులు పోలీసులకు తెలిపారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముత్తుకుమార్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.