అవినీతి అనకొండ శివబాలకృష్ణ.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు

అవినీతి అనకొండ శివబాలకృష్ణ.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు
  • క్విడ్ ప్రో కో తరహాలో కంపెనీల్లో షేర్లు, బినామీ పెట్టుబడులు 
  • హెచ్‌‌‌‌ఎండీఏ, రెరా అడ్డాలుగా అవినీతి
  • మనీలాండరింగ్‌‌‌‌ కేసులో ఈడీ దర్యాప్తు
  • శివబాలకృష్ణ కంపెనీల్లో గురు, శుక్రవారాల్లో సోదాలు
  • డిజిటల్‌‌‌‌ డాక్యుమెంట్లు స్వాధీనం
  • బినామీ ఆస్తుల గుర్తింపు, రూ.72 లక్షల నగదు సీజ్‌‌‌‌.. 
  • గ్రేటర్ చుట్టూ 120 ఎకరాలు కొన్నట్టు ఇదివరకే గుర్తించిన ఏసీబీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హెచ్‌‌‌‌ఎండీఏ టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ మాజీ డైరెక్టర్‌‌‌‌, రెరా మాజీ ఇన్​చార్జ్ సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తుల గుట్టు రట్టు అవుతున్నది. క్విడ్‌‌‌‌ ప్రో కో(నీకిది నాకది) తరహాలో సాగిన శివబాలకృష్ణ అవినీతి దందాలను ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు.

శివబాలకృష్ణపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్‌ యాక్ట్(పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు గురు, శుక్రవారాల్లో లక్డీకాపూల్‌, కొండాపూర్‌, రామంతాపూర్‌లోని శ్రీకృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌, కొరిజోన్‌ స్పేసెస్‌, ఉదయ ఎస్‌ఎస్‌వీ ప్రాజెక్ట్‌ కార్యాలయాలు, సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.72 లక్షల నగదు సహా కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేశారు. జీహెచ్‌‌ఎంసీ, హెచ్‌‌ఎండీఏ టౌన్ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన శివబాలకృష్ణను గతేడాది జనవరి 25న ఏసీబీ అరెస్ట్‌‌ చేసింది. రూ. 100 కోట్ల నగదు, కిలోల కొద్దీ   బంగారం, వెండి, రూ.8.26 కోట్లువిలువ చేసే సెల్‌‌ఫోన్లు, ఖరీదైన విదేశీ వాచీలు, విల్లాలు సహా 100 ఎకరాలకు పైగా భూముల డాక్యుమెంట్లను సీజ్‌‌ చేసింది. ఏసీబీ ఎఫ్‌‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

బిల్డర్లు, రియల్టర్లతో క్విడ్ ప్రో కో..  
హెచ్‌‌ఎండీఏ, రెరా అడ్డాలుగా శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్‌‌ సంస్థలతో క్విడ్‌‌ ప్రో కోకు పాల్పడ్డట్టు ఈడీ విచారణలో వెలుగు చూస్తున్నది. హెచ్‌‌ఎండీఏ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్‌‌ వ్యాపారులకు శివబాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించింది. బిల్డింగ్‌‌ ప్లాన్స్‌‌ మంజూరు, చేంజ్ ఆఫ్ ల్యాండ్‌‌ సహా వివిధ రకాల అనుమతుల కోసం బిల్డర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఈ డబ్బుతో స్థిర, చరాస్తుల కొనుగోలు, కుటుంబ సభ్యులు సహా అనుచరుల బ్యాంక్ అకౌంట్లలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినట్లు గుర్తించింది.

ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్‌‌ వ్యాపారులకు లబ్ధి చేకూర్చినందుకు గాను భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఏసీబీ సేకరించిన ఆస్తుల డాక్యుమెంట్ల ఆధారంగా కంపెనీల్లో శివబాలకృష్ణ పెట్టిన పెట్టుబడులు, బినామీ ఆస్తుల వివరాలు ఈడీ సేకరిస్తోంది. దర్యాప్తులో భాగంగా ఈ నెల 2న రాజేంద్రనగర్‌‌‌‌ మణికొండలోని శివబాలకృష్ణ ఇల్లు, చైతన్యనగర్‌‌‌‌లోని ఆయన సోదరుడు నవీన్‌‌కుమార్‌‌‌‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది. 

గ్రేటర్ చుట్టూ120 ఎకరాల భూములు 
అధికారిక, అనధికారిక అనుమతులు ఇచ్చేందుకు ముందస్తు ఒప్పందాలు చేసుకుని, రియల్‌‌ ఎస్టేట్ సంస్థల్లో బినామీ పేర్లతో శివబాలకృష్ణ షేర్లు తీసుకున్నట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్‌‌ వ్యాపారులు, బిల్డర్ల నుంచి క్విడ్ ప్రో కో విధానంలో వివిధ కంపెనీల్లో షేర్లు, బినామీల పేర్లతో రూ. వందల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ, ఏసీబీ అధికారులు గుర్తించారు. రీజినల్ రింగ్‌‌ రోడ్‌‌ పరిసర ప్రాంతాల్లోను పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

ఇందుకు సంబంధించి ఏసీబీ స్వాధీనం చేసుకున్న దాదాపు120 ఎకరాలకు పైగా భూములు, వందల కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ సేకరించింది. దీంతో పాటు శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ స్వాధీనం చేసుకున్న కార్లు, రూ.లక్షల విలువ చేసే వాచీలు, ఎలక్ట్రానిక్‌‌ గూడ్స్‌‌ కూడా రియల్ ఎస్టేట్‌‌ కంపెనీల నుంచి క్విడ్ ప్రో కో తరహాలో పొందినట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం.