
జైపూర్: అసెంబ్లీ ఎన్నికల ముందు రాజస్థాన్ లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఈడీ అధికారులు గురువారం తనిఖీలు చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ కూ ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో ఆయనకు సమన్లు ఇచ్చింది.
ఈ కేసులో శుక్రవారం (అక్టోబరు 27) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పరీక్షా పత్రం లీక్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేపట్టింది. జైపూర్‌లో గోవింద్ సింగ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసులు, మహువా కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా నివాసం సహా పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఈడీ తనిఖీలు చేసింది.
ఇదీ కేసు..
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సీనియర్గ్రేడ్2 టీచర్పరీక్షలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ప్రశ్న పత్రం లీక్ చేసి కొందరు అభ్యర్థుల వద్ద రూ.8 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేసినట్లు కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా మనీ లాండరింగ్కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో పబ్లిక్‌సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు బాబూలాల్ తోపాటు అనిల్ కుమార్ మీనా, భూపేంద్ర శరణ్ అనే మరో ఇద్దరు వ్యక్తులను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది.