ఏసీ పేలి.. హాస్టల్లో మంటలు..పొగతో 15 మంది విద్యార్థులకు అస్వస్థత..అల్వాల్ లో ఘటన

ఏసీ పేలి.. హాస్టల్లో మంటలు..పొగతో 15 మంది విద్యార్థులకు అస్వస్థత..అల్వాల్ లో ఘటన

అల్వాల్, వెలుగు: అబిడ్స్ ఘటన మరవకముందే సిటీలో మరో చోట అగ్నిప్రమాదం జరిగింది. ఎడ్యుకేషన్ హాస్టల్లో ఒక్కసారిగా ఏసీ పేలడంతో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్​లోని హైటెన్షన్ లైన్​లో నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్​కొనసాగుతోంది. ఇందులోని మొత్తం ఐదంతస్తుల బిల్డింగ్​లో ఇదే ఇన్​స్టిట్యూట్​కు చెందిన విద్యార్థులు ఉంటూ దగ్గరలోని కాలేజీలకు వెళ్లి వస్తున్నారు. 

ఆదివారం నాల్గవ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ బ్లాస్ట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హాస్టల్లో ఉన్న సుమారు వందకు పైగా విద్యార్థులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. కొంతమంది విద్యార్థులు భయాందోళనకు గురై స్పృహ తప్పిపోవడంతో వారిని కొంతమంది బయటకు తీసుకొచ్చారు. 

కొందరు ఎగ్జిట్ నుంచి విద్యార్థులు  బయటకెళ్లారు. పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, వారిని వెంటనే కొంపల్లిలోని వెల్నెస్ హాస్పిటల్​కు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 11 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ కాగా, మరో నలుగురికి చికిత్స కొనసాగుతోంది. కాగా, ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. హాస్టల్​కు అసలు అనుమతులు ఉన్నాయా లేవా? స్టూడెంట్లకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.