బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన ఆవుల బాలమల్లు అలియాస్ పుష్ప లొంగిపోయారు. గత ఏడాది బాలమల్లు భర్త జాడి వెంకటి చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయారు. భార్యాభర్తలు జాడి వెంకటి, బాలమల్లు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) విప్లవోద్యమానికి ఆకర్షితులై 28 ఏండ్ల కింద అడవి బాట పట్టారు. సుదీర్ఘ కాలం అజ్ఞాతంలో గడపగా, భర్త వెంకటి మృతితో బాలమల్లు కలత చెంది ఉద్యమం నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తారి జిల్లాలో రెండు రోజుల కింద 9 మంది మావోయిస్టులతో కలిసి రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేశ్ మిశ్రా ఎదుట లొంగిపోయారు. బాలమల్లు ఒడిశా మావోయిస్టు కమిటీలోని ధమ్తారి -గరియాబంద్ -నువాపాడ డివిజన్ పరిధిలోని నాగరి, సితానది ఏరియా కమిటీలో పని చేశారు. డీవీసీఎం స్థాయికి ఎదిగిన బాలమల్లుపై అక్కడి ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది.
