ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా..ఫామ్ పాండ్‌‌ లో పడి ముగ్గురు చిన్నారులు మృతి

ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా..ఫామ్ పాండ్‌‌ లో పడి ముగ్గురు చిన్నారులు మృతి
  • నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా ముచ్చర్లపల్లి గ్రామంలో విషాదం

కల్వకుర్తి, వెలుగు : సెల్ఫీ తీసుకునేందుకు ఫామ్ పాండ్‌‌ వద్దకు వెళ్లిన బాలుడు నీటిలో పడిపోగా.. అతడిని రక్షించబోయి మరో ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మాదు శ్రీకాంత్‌‌రెడ్డి కుమార్తె సిరి (14), కుమారుడు హిమాన్యు(11), సోదరి కుమార్తె ఎడ్మ స్నేహ (17) హైదరాబాద్‌‌లో చదువుకుంటున్నారు.

 స్కూళ్లకు సెలవులు ఉండడంతో ఇటీవల గ్రామానికి వచ్చారు. శ్రీకాంత్‌‌రెడ్డి ఆదివారం పిల్లలతో కలిసి సమీపంలోని మాదు వేణుగోపాల్‌‌రెడ్డి పొలం వద్దకు వెళ్లారు. హిమాన్యు సమీపంలో ఉన్న ఫామ్ పాండ్‌‌ వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయాడు. గమనించిన సిరి తన తమ్ముడిని కాపాడేందుకు నీటిలోకి దిగి మునిగిపోయింది. 

తర్వాత వారిని కాపాడేందుకు స్నేహ సైతం కుంటలోకి వెళ్లగా.. లోతు ఎక్కువగా ఉండడంతో ఆమె కూడా మునిగిపోయింది.  అక్కడే ఉన్న వేణుగోపాల్‌‌రెడ్డి కుమార్తె విద్యాధరణి కూడా కుంటలోకి దిగి లోనికి వెళ్లలేక, బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయింది. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో పక్క పొలంలో పనిచేస్తున్న రాణి అనే మహిళ కుంట వద్దకు వచ్చి విద్యాధరణిని బయటకు లాగింది. 

విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుంట వద్దకు చేరుకొని చిన్నారులను బయటకు తీయగా.. అప్పటికే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.