విద్య సంస్కారం నేర్పుతుంది... చదువుతోనే జీవనశైలి మార్పు..సమాన అవకాశాలు ఉండాలి..

విద్య సంస్కారం నేర్పుతుంది... చదువుతోనే జీవనశైలి మార్పు..సమాన అవకాశాలు ఉండాలి..

విద్య గురించి కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. సమాజంలో విద్యకు సంబంధించిన మౌలిక వసతులు అందరికీ సమానంగా ఉండాలి. కొందరికి ఆ అవకాశాలు చేరువగా ఉండటం, మరి కొందరికి దూరంగా ఉండటం సమాజ శ్రేయస్సుకి హానికరం. ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు.ఒక పేదవాడి పిల్లల్ని సంపన్నులుగా చేయగలిగేది చదువు.

  • ఒక గుమాస్తాకు పుట్టిన వారిని కలెక్టర్‌‌‌‌‌ స్థాయికి చేర్చగలిగేది చదువు.
  • ప్రపంచమంతా అతి సాధారణ వ్యక్తి వైపు చూసేలా చేసేది చదువు.
  •  అందుకే చదువు అందరికీ ప్రధానం

ఎవరైనా మనలను, ‘గురువు, గోవిందుడు... ఇద్దరూ ఎదురైతే ఎవరికి నమస్కారం చేస్తారు’ అని ప్రశ్నిస్తే.. ‘ఈయన గోవిందుడు అని తెలియచెప్పిన గురువుకే మొదటి నమస్కారం చేయాలి’ అనే సంస్కారం మనకు చదువే నేర్పుతుంది. అన్ని విషయాల పట్ల అవగాహన కలిగేలా చేసే శక్తి కేవలం గురువుకే సాధ్యం. అటువంటి సద్గురువుల వద్ద నేర్చిన చదువు.. ఒక వ్యక్తిని ప్రపంచంలో ఉన్నతస్థాయికి ఎదిగేలా చేస్తుంది. 
విద్య గురించి భర్తృహరి ఇలా అంటాడు...

విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్‌‌‌‌
విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్‌‌
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెఱుంగని వాడు మర్త్యుడే 

విద్య అనేది రహస్యంగా దాచిపెట్టుకున్న ధనంలాంటిది. మానవులకు చదువు అందాన్ని తీసుకొస్తుంది. విద్య వల్ల కీర్తిప్రతిష్ఠలు, సుఖాలు సమకూరుతాయి. విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవం కూడానూ. ఈ భూమి మీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. పాలకుల చేత పూజింపబడేది విద్య. చదువు రాని వాడు మనిషి కాడు అని భావం. 

ఇక్కడ మనం ఒక విషయం సరిగా అర్థం చేసుకోవాలి..చదువు లేదా విద్య అనే దానికి కేవలం అక్షర జ్ఞానం మాత్రమే అనుకుంటే పొరపాటు. ఏ కళలో ప్రావీణ్యం ఉన్నా అది చదువుతో సమానమే. అంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారు సంగీతంలో అపర సరస్వతులు. అంటే వారు సంగీత విద్యలో ప్రవీణులని అర్థం. వెంపటి చిన్న సత్యం వంటి వారు నాట్య శాస్త్రం మొత్తం తెలిసిన వారు. వారు నృత్య విద్యలో ప్రవీణులు. ఇదేవిధంగా కొందరు వడ్రంగి పనిలో నేర్పరితనం సాధిస్తారు. అంటే వారు వడ్రంగి విద్యలో ప్రవీణులని అర్థం. తోలుబొమ్మలు ఆడించేవారు, హరికథలు చెప్పేవారు, బుర్రకథలలో పాండిత్యం ఉన్నవారు. అమర శిల్పి జక్కన్న వంటి శిల్పాచార్యులు... వీరంతా ఆయా కళల విభాగంలో పాండిత్యం ప్రదర్శించి దేశవిదేశాలలో ప్రఖ్యాతి గాంచారు. 

ఇక్కడ కొందరు ప్రసిద్ధుల గురించి ప్రస్తావించుకుందాం.. నన్నయ, పెద్దన, తెనాలి రామకృష్ణుడు, కవిసమ్రాట్‌‌ విశ్వనాథ సత్యనారాయణ.. వీరంతా సుశిక్షితులైన గురువుల వద్ద చదువుకొని ప్రసిద్ధులయ్యారు. వారివారి  పేర్లను కొన్ని వందల సంవత్సరాలుగా నిలబడేలా చేసుకున్నారు. నేటికీ నన్నయ ‘భారతం’, పెద్దన ‘మనుచరిత్ర’, తెనాలి రామకృష్ణుడి ‘పాండురంగ మహాత్మ్యం’, కవిసమ్రాట్‌‌ విశ్వనాథ సత్యనారాయణ ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’... అందరికీ అధ్యయన గ్రంథాలే. ఇంకా మరెందరో సాహితీ ప్రపంచంలో వారి వారి విద్య ద్వారా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

మహాభారతంలో.. 

పరశురాముడి దగ్గర ధనుర్విద్య అభ్యసించిన భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడి దగ్గర ధనుర్విద్యను అభ్యసించిన అర్జునుడు.. మహాభారతంలో ప్రముఖులుగా నిలిచిపోయారు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర మంత్రిగా ఉన్న తిమ్మరుసు, చంద్రగుప్తుడికి రాజనీతి బోధించిన చాణక్యుడు... వీరంతా రాజనీతి శాస్త్రం చదివి ప్రముఖులుగా గౌరవ స్థానం పొందారు. 

మనం ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలి.. ఏ శాస్త్రం అభ్యసించాలన్నా వారికి మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలి. సకల సౌకర్యాలు అందరికీ సమానంగా అందేవిధంగా పరిపాలకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవటం వల్లే ఆయా కాలాలలో విద్యార్థులంతా విద్యను సముపార్జించారు. ఆ విద్యతో సముచిత రీతిలో గౌరవసత్కారాలు అందుకున్నారు. అందుకే అందరికీ విద్యను అందేలా చూడటం పాలకుల కనీస కర్తవ్యం.

డా. పురాణపండ వైజయంతి