
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ విస్తరణకు అంతా రెడీ అయ్యింది. విస్తరణలో భాగంగా పలువురు మంత్రులకు మోడీ సర్కార్ ఉద్వాసన పలకనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, ఎరువుల శాఖ మంత్రి డీఏ సదానంద గౌడ, విద్యా శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోతరే, రతన్ లాల్ కటారియా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌తోపాటు వయో భారంతో కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ (72)ను కేబినెట్ నుంచి తప్పించారు. కర్నాటక గవర్నర్‌గా నియమితులైన థావర్ చందర్ గెహ్లాట్ కేంద్ర మంత్రి పదవితోపాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
వీరికి పదోన్నతి?
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రూపాల, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే జ్యోదిరాదిత్య సింధియా, శర్బానంద సోనోవాల్, భూపేందర్ యాదవ్, మీనాక్షి లేఖి, అనుప్రియా పటేల్‌తోపాటు కొత్తగా 28 మందికి మంత్రి పదవులు లభించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.