ఎస్సీ ఈఆర్టీలో పైరవీలు నడ్వయ్

ఎస్సీ ఈఆర్టీలో పైరవీలు నడ్వయ్
  • సమీక్షా సమావేశంలో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం 
  • కోర్టు కేసులపై నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులకు హెచ్చరిక

హైదరాబాద్,వెలుగు : ఎస్సీఈఆర్టీలో ఫైరవీలతో ఉద్యోగాలు ఇచ్చుడు ఉండదని, ప్రతిభ ఆధారంగానే  పోస్టులను భర్తీ చేస్తామని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్​ ద్వారా కొత్తవారిని తీసుకుంటామని వెల్లడించారు. ప్రత్యక్షంగా తిరిగి స్కూళ్లను పర్యవేక్షిస్తామన్నారు. మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​లో సంబంధిత అధికారులతో ఆయన రివ్యూ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి  ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ టాప్ ప్రయార్టీ అని, ఇప్పటికీ పలుమార్లు రివ్యూలు చేయడమే దీనికి నిదర్శమని చెప్పారు.

జాగ్రత్తగా పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్​లో కోర్టు కేసులు, కంటెమ్ట్ కేసులు భారీగా ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కోర్టు కేసులపై అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. కంటెమ్ట్ దాకా వస్తున్నాయంటే నెగ్లిజెన్సీ ఉన్నట్టే కదా అని వారిని ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇతర దేశాల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్  టీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, మన దేశంలో మాత్రం హయ్యర్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రొఫెసర్లకు ప్రయార్టీ ఇస్తున్నారని చెప్పారు.

మన ఊరు మన బడి స్కీమ్​పై త్వరలోనే రివ్యూ ఉంటుందని, దానికి అనుగుణంగా పూర్తి డేటాను సేకరించుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, సమగ్ర శిక్ష ఏఎస్​పీడీ రమేశ్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్కూళ్లు, కాలేజీల సమస్యలు పరిష్కరించాలె : 

విద్యాశాఖ సెక్రటరీకి ఏఐఎస్ఎఫ్ వినతి రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో అన్నిరకాల సౌలతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, ప్రధాన కార్యదర్శి  పుట్ట లక్ష్మణ్ కోరారు. మంగళవారం విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశంను ఏఐఎస్ఎఫ్​ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇన్ చార్జ్ ఎంఈవో, డీఈవోలతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని, వెంటనే రెగ్యులర్ అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కాబట్టి, స్టూడెంట్లకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయాలని లేకుంటే బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు.