పునాస దిగుబడులపై  వానల ఎఫెక్ట్

పునాస దిగుబడులపై  వానల ఎఫెక్ట్
  • ఈసారి  1.09 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

హైదరాబాద్, వెలుగు: ఈసారి ఖరీఫ్ ​ఆహార ధాన్యాల ఉత్పత్తి కోటి 9 లక్షల​టన్నులు రానుంది. వరి ఉత్పత్తి సర్కార్​ అనుకున్న లక్ష్యాన్ని మించుతోంది. ఇక పప్పులు నామమాత్రంగానే ఉత్పత్తి అంచనా వేశారు. మొత్తం ఫుడ్ గ్రెయిన్స్​ ప్రొడక్షన్​లో 5.80 లక్షల​ టన్నులు మాత్రమే పప్పు పంటల ఉత్పత్తి ఉంది. 2020–21 వానాకాలం పంట ఉత్పత్తుల ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్​రిపోర్ట్​ను ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్​ సోమవారం ప్రభుత్వానికి నివేదించింది. మొత్తం ఫుడ్​ గ్రెయిన్స్​లో బియ్యం మేజర్ షేర్ ఉండగా మొక్కజొన్న, జొన్నలు, కందులు, పెసలు అంతంత మాత్రంగానే ఉత్పత్తి వస్తున్నట్లు అంచనా వేశారు. ఇక పత్తి టార్గెట్ కంటే చాలా తగ్గుతోంది. ఈసారి 49.68 లక్షల బేళ్లు పత్తి ఉత్పత్తి వస్తుందని పేర్కొన్నారు. ఈసారి ఖరీఫ్​ పంటలకు వర్షాల దెబ్బ గట్టిగా పడింది. దీంతో దిగుబడులు చాలా తగ్గి, ఉత్పత్తిపై ఎఫెక్ట్​ పడినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఆహార ధాన్యాల్లో అత్యంత కీలకమైన వరి సర్కార్ అంచనాలను తలకిందులు చేసింది. సాగు విస్తీర్ణం ప్రభుత్వం అనుకున్న దానికంటే 13 లక్షల ఎకరాలు అధికంగా సాగైంది.
వడ్లు కోటి 38 లక్షల మెట్రిక్​ టన్నులు
ఈ ఖరీఫ్​లో 41.85 లక్షల ఎకరాలు వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఎకరాకు 29 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని సీజన్ మొదలు కంటే ముందు అంచనా వేశారు. ఈ లెక్కన కోటి 17 లక్షల​ టన్నుల ఉత్పత్తి వస్తుందనుకున్నారు. అయితే సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వరుస వర్షాలు, వరదలు పంటపై ఎఫెక్ట్​ చూపెట్టాయి. దీంతో అది 26.50  క్వింటాళ్ల వరకే పరిమితమైంది. అంటే రెండున్నర క్వింటాళ్లు తగ్గింది. అయినా సాగు విస్తీర్ణం పెరగడంతో వరి ఉత్పత్తి కోటి 38 లక్షల మెట్రిక్​వస్తుందని అంచనా వేశారు. పంట చేతికొచ్చే సరికి వాతావరణ పరిస్థితులు మారితే ఇది కొంత తగ్గే అవకాశముందని ఆఫీసర్లు చెప్తున్నారు. జొన్నలు 22 వేల మెట్రిక్​ టన్నులు, మొక్కజొన్న 11.37 లక్షల​ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. వరిపై సర్కార్ యూటర్న్ తీసుకోవడంతో జొన్నలు, మొక్కజొన్న కొనుగోళ్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.
పత్తి తగ్గుతోంది..
పత్తి సర్కార్​లక్ష్యాలను తలకిందులు చేసింది. ఈ ఖరీఫ్​లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 51.04 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దీంతో ఉత్పత్తి 69.46 లక్షల బేళ్లు వస్తుందని ఫస్ట్​అడ్వాన్స్ ఎస్టిమేట్స్​ రిపోర్ట్​లో పేర్కొన్నారు. అనుకున్న లక్ష్యంలో 30 శాతం తగ్గుతోందని ఆఫీసర్లు తెలిపారు. ఇక సోయాబీన్​ 2.43 లక్షల టన్నులు, వేరుశనగ 24 వేల టన్నులు, పసుపు 2.45 లక్షల టన్నులు ఉత్పత్తి అంచనా వేశారు.

పప్పుల ఉత్పత్తి అంతంతే
పప్పు పంటల ఉత్పత్తి తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్​లో పేర్కొన్నారు. సీజన్​ కంటే ముందు కందుల ఉత్పత్తి ఎక్కువగా వస్తుందనుకున్నప్పటికీ సాగు లక్ష్యాన్ని చేరలేదు. దీంతో ప్రొడక్షన్ తగ్గింది. మొత్తం పప్పు పంటల ఉత్పత్తి  5.80 లక్షల​ టన్నులు అంచనా వేశారు. ఇందులో కందుల ఉత్పత్తి 5.32 లక్షల టన్నులుగా ఉంది.  పెసలు 32 వేల టన్నులు, మినుములు 16 వేల టన్నులు ఉత్పతి  వస్తుందని అంచనా వేశారు.