కామేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కోట మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వెల్లడించారు. గురువారం కామేపల్లి మండలంలోని కొత్త లింగాల గ్రామంలో కోట మైసమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల ఇలవేల్పులుగా నిరంతర పూజలు అందుకుంటున్న కోట మైసమ్మ తల్లి ఆలయానికి మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు.
దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయించి ఆలయానికి అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి,ఆలయ కార్యనిర్వహణాధికారి కే వేణుగోపాలాచార్యులు, సర్పంచ్ ఇట్టా శ్రీనివాస్ పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
