గుడ్డు రేటుతో.. గుడ్లు తేలేస్తున్న జనం

గుడ్డు రేటుతో.. గుడ్లు తేలేస్తున్న జనం

కోడి గుడ్డు.. శాఖాహారమా.. మాంసాహారమా అని తేడా లేకుండా చాలా ఎక్కువ మంది ఇష్టంగా తినే కోడి గుడ్డు.. ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే ఆరోగ్యం అనే ఫీలింగ్ లో ఉన్న రోజుల్లో.. కోడి గుడ్డు ధరలు షాక్ కొడుతున్నాయి. మొన్నటి వరకు 4 నుంచి 5 రూపాయల మధ్య ఉన్న.. ఒక్కో కోడి గుడ్డు ధర.. ఇప్పుడు సూపర్ మార్కెట్ లోనే ఆరు రూపాయలు పలుకుతుంది. ఇక బస్తీలు, గల్లీలు, వీధుల్లోని కిరాణా దుకాణాల్లో ఒక్క కోడి గుడ్డు 7 రూపాయలు చెబుతున్నారు వ్యాపారులు. నెల రోజుల్లోనే రూపాయి ధర పెరిగింది. సామాన్యులకు ఎంతో ఇష్టమైన.. బ్యాచిలర్స్ కు ఎంతో ఫేవరేట్ అయిన కోడి గుడ్డు ఏడు రూపాయలకు చేరటంతో.. గుడ్డు ధర చూసి గుడ్లు తేలేస్తున్నారు సామాన్యులు. 

కోడి గుడ్డు ధర పెరగటానికి కారణం లేకపోలేదు. కార్తీక మాసంలో సహజంగానే చికెన్, కోడి గుడ్డుకు దూరంగా ఉంటారు చాలా మంది. దీంతో కోళ్ల ఫారం యజమానులు సైతం పెంపకాన్ని సగానికి సగం తగ్గిస్తారు.. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి అలాగే జరిగింది.. కాకపోతే గత ఏడాదితో పోల్చినప్పుడు.. కోడి గుడ్ల డిమాండ్ మాత్రం పెరిగింది.. సప్లయ్ తక్కువగా ఉండటం.. డిమాండ్ పెరగటంతో.. ఒక్కసారిగా కోడి గుడ్డు ధర పెరిగింది. 

వాతావరణం మారింది.. ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న జనం.. గుడ్ల వినియోగాన్ని భారీగానే పెంచారు. గతంతో పోల్చితే మధ్య తరగతి కుటుంబాల్లోనూ వారంలో నాలుగు రోజుల కోడి గుడ్డు కామన్ అయిపోయింది. పిల్లలు, పెద్దలు అని లేకుండా వినియోగం పెరగటంతో.. రోజురోజుకు కోడి గుడ్డు ధర పెరుగుతుంది. గతంలో డజన్ ఎగ్స్ 36 నుంచి 45 రూపాయల మధ్య ఉండేది.. ఈ ధరకే ఎక్కువ అనుకునే వారు.. ఇప్పుడు మాత్రం ఏకంగా డజన్ ఎగ్స్ 60 రూపాయలు కామన్ అయ్యింది..ఇప్పుడు అది 72 రూపాయలకు చేరింది.. అంటే ఒక్కో కోడి గుడ్డు 7 రూపాయలు.. సామాన్యుడు గుడ్లు తేలేయక.. ఇంకేం చేస్తాడు.. అమ్మో పులి అన్నట్లు.. బాబోయ్ గుడ్డు అంటున్నాడు..