రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధర..ఎందుకు పెరిగిందంటే.?

రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధర..ఎందుకు పెరిగిందంటే.?
  • రెండు వారాల కింద రూ.6.. చలి కారణంగా ఫుల్ డిమాండ్ 
  • హైదరాబాద్​లో రోజుకు కోటి గుడ్ల వినియోగం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కోడిగుడ్ల ధర పెరిగింది. రెండు వారాల కింద ఒక్కో గుడ్డు రూ.6 ఉండగా, ఇప్పుడు రూ.7కు చేరింది. హోల్ సేల్​లో ఒక్కో గుడ్డు రూ.5.80 పలుకుతోంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​లో ఎగ్స్​కు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు. సిటీలో సాధారణంగా రోజుకు 80 లక్షల కోడిగుడ్ల వాడకంఉంటుందని, ప్రస్తుతం కోటికి చేరిందని నేషనల్​ఎగ్​ కో ఆర్డినేషన్ ​కమిటీ (నెక్) ఉపాధ్యక్షుడు సుబ్బరాజు తెలిపారు. ఢిల్లీ, ముంబై​ వంటి నగరాల్లో రోజుకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు కోడిగుడ్ల వినియోగం ఉంటుందని సుబ్బరాజు పేర్కొన్నారు. 

ధర ఎందుకు పెరిగిందంటే.. 

కార్తీకమాసం ముగియడంతో ధరలు పెరిగాయి. అలాగే, కోళ్ల దాణా ధరలు రెట్టింపు అవ్వడం కూడా గుడ్ల ధరలు  పెరగాడానికి కారణమని సుబ్బరాజు చెప్పారు. గతంలో కరోనా టైమ్ లో గుడ్ల వినియోగం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ప్రచారంతో చాలామంది ఎగ్స్ తింటున్నారన్నారు. ‘‘దేశవ్యాప్తంగా తెలంగాణలోనే కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఎగ్స్ లో దాదాపు 50 శాతం ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్​వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం” అని చెప్పారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.