న్యూఢిల్లీ: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను తయారు చేసే ఐషర్ మోటార్స్ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో రూ.1,070 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. సేల్స్ పెరగడంతో కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన ప్రాఫిట్ రూ.906 కోట్ల కంటే 18 శాతం గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ మొత్తం రెవెన్యూ 3,804 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.4,256 కోట్లకు ఎగసింది. క్యూ4 లో కంపెనీ బైక్ డివిజన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 2,27,925 బండ్లను అమ్మింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఈ నెంబర్ 2,14,685 గా రికార్డయ్యింది.
మొత్తం 2023–24 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఐషర్ మోటార్స్ నికర లాభం 37 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగి రూ.4,001 కోట్లకు చేరుకుంది. 2022–23 లో రూ.2,914 కోట్ల లాభాన్ని కంపెనీ సాధించింది. రెవెన్యూ రూ.14,442 కోట్ల నుంచి రూ.16,536 కోట్లకు పెరిగింది. ఇది 14.5 శాతం గ్రోత్‌కు సమానం. 2023–24 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 9,12,732 బండ్లను అమ్మింది. షేరుకి రూ.51 డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఐషర్ మోటార్స్ షేర్లు శుక్రవారం 2.23 శాతం పెరిగి రూ.4,670 దగ్గర సెటిలయ్యాయి.
