దళిత కుటుంబానికి రూ.10 లక్షలు

దళిత కుటుంబానికి రూ.10 లక్షలు
  •     నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ
  •     రూ. 1,200 కోట్లతో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం
  •     అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం
  •     ప్రగతిభవన్​లో పదకొండుగంటలు సాగిన భేటీ
  •     నిధులు సమకూర్చే బాధ్యత నాదే: సీఎం కేసీఆర్​
  •     ఎస్సీల వద్ద ఉన్న అసైన్డ్​ ల్యాండ్స్​ లెక్కలు తీయాలని ఆదేశం
  •     దళిత ఉద్యోగుల ప్రమోషన్లు పదిరోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడి

హైదరాబాద్‌, వెలుగు: దళితుల ఆర్థిక సాధికారత కోసం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ సాయంతో దళిత కుటుంబాలు తమకు నచ్చిన విధంగా ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. కడు బీదరికంలో ఉన్న కుటుంబాలను ఎంపిక చేసి వారికి సాయం అందిస్తారు. మొదటి దశలో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి 1,190 కుటుంబాలకు రూ.1,200 కోట్ల సాయం అందించాలని నిర్ణయించారు. ‘సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌’ స్కీంపై ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆల్‌ పార్టీ సమావేశం నిర్వహించారు. దళిత ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి వరకు 11 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని దళిత కుటుంబాలు సగర్వంగా తలెత్తుకునేలా ఈ పథకానికి రూపకల్పన చేస్తున్నట్టు సీఎంవో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకం వారి జీవితాల్లో గుణాత్మక మార్పులకు దోహదం చేస్తుందని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డట్లు సీఎంవో పేర్కొంది. దళిత జనోద్దరణకు సీఎం ఆలోచనలు, ఇప్పటికే అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అఖిలపక్షం కొనియాడినట్లు సీఎంవో పేర్కొంది. 

పాలనలో నిర్లక్ష్యం చేస్తే రేపటి తరాలు నష్టపోతయ్​: సీఎం

దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురికావడం భారత సమాజానికే కళంకమని సీఎం కేసీఆర్​ అన్నారు. తమ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని, విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ఇంకా దారిద్య్ర రేఖకు దిగువన, బాటమ్‌ లైన్‌లో ఉన్న దళిత కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా ‘సీఎం దళిత్​ ఎంపవర్​మెంట్’​ పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు.‘‘కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి పోయినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్గాలు దళితులే. వారిని బాగు చేయడానికి దశలవారీగా కార్యాచరణ అమలు చేస్తాం. పారదర్శకంగా సీఎం దళిత్​ ఎపంవర్​మెంట్​  పథకం అమలు చేస్తాం. రానున్న మూడు, నాలుగేండ్లలో రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని సీఎం తెలిపారు. 

భూముల లెక్కలు తీయాలి

రాష్ట్రంలోని 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాలు భూమి ఉందని, స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా చేయూతనిస్తూనే, స్థిరత్వం సాధించని, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలను మొట్ట మొదట ఆదుకుంటామని సీఎం కేసీఆర్​ అన్నారు. ఎస్సీల వద్ద ఉన్న భూముల్లో అసైన్డ్‌ ల్యాండ్స్‌ ఎన్ని ఎకరాలు, అందులో ఉన్నదెంత, పోయినదెంత అనే వివరాలు తీయాలని అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు భూముల లెక్కల మీదనే అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. గోరటి వెంకన్న రాసిన ‘గల్లీ చిన్నది..’ పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని సీఎం చెప్పారు. అర్హుల గుర్తింపునకు దళిత కుటుంబాల గణన చేయాలన్నారు. అట్టడుగున ఉన్న వారి నుంచి సాయం ప్రారంభించి, వారు అభివృద్ధి పొందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ కోసం ఖర్చు చేసే మొత్తం ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు అదనం అని పేర్కొన్నారు. ‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనేది తన నినాదమని సీఎం చెప్పారు.  సఫాయి కార్మికులు తల్లిదండ్రులకన్నా ఎక్కువని చెప్పారు. ఎవరూ డిమాండ్‌ చేయకున్నా వాళ్ల జీతాలు పెంచుతూ వస్తున్నామని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రతతో కూడిన పీఆర్సీ తరహా జీతభత్యాల రూపకల్పన విధానం అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల అమలుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని చెప్పారు. “అద్దాల అంగడి మాయా లోకం మోపైంది. ఈ పోటీ ప్రపంచం, కరోనా నేపథ్యంలో దళిత బిడ్డలు నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎటువంటి బ్యాంకు గ్యారంటీల జంజాటం లేకుండానే సీఎం దళిత సాధికారత పథకం  ద్వారా  కడునిరుపేద దళిత కుటుంబాలకు సహకారం అందిస్తాం” అని కేసీఆర్‌  తెలిపారు. 

ప్రమోషన్లు పదిరోజుల్లో పూర్తి చేయాలి

దళిత ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్‌లను పది, 15 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని, కమిట్‌మెంట్‌ ఉన్న అధికారులను నియమించుకోవాలని, ఇందుకు సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ విధానాలు అనుసరించాలన్నారు.   ఖర్చు ఎంతయినా ఫర్వాలేదని, సివిల్‌ సర్వీసెస్‌ సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించాలన్నారు. 

కేసీఆర్‌కు భగవంతుడి ఆశీర్వాదం: మోత్కుపల్లి

ఎస్సీల అభివృద్ధికి ఇంతగా తపించే కేసీఆర్‌కు భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నట్లు సీఎంవో తన ప్రకటనలో పేర్కొంది. దళితుల కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నానని, గుట్టను ప్రపంచం గుర్తించే స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని ఆయన కొనియాడినట్లు వివరించింది. 

దళిత సమాజానికి సీఎం భరోసా ఇచ్చారు: భట్టి

మరియమ్మ లాకప్‌ డెత్‌ విషయంలో సీఎం స్పందించి దళిత సమాజానికి భరోసా, ధైర్యాన్ని ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నట్లు సీఎంవో పేర్కొంది. పోలీసుల ప్రవర్తనలో ఇకనైనా మార్పు రావాలని ఆయన కోరారు. దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీంను అధికార యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తుందనే విశ్వాసం తనకుందని, అసైన్డ్‌ భూములు వెనక్కి తీసుకోవడం కన్నా, ఆ భూముల విలువ నిర్దారించి.. అక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో దళితులకు వాటాలు ఇవ్వాలని భట్టి సూచించినట్లు సీఎంవో  తెలిపింది. ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఆయన కోరినట్లు వివరించింది.