ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌.. పంటల రేట్లు పైపైకి .. దిగుబడి తగ్గుతుండటంతో పెరగనున్న ధరలు

ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌.. పంటల రేట్లు పైపైకి ..  దిగుబడి తగ్గుతుండటంతో పెరగనున్న ధరలు
  • కల్లాల వద్దకే వచ్చి కొననున్న వ్యాపారులు
  • సన్న వడ్లు క్వింటా రూ.3 వేలు పలికే చాన్స్
  • మద్దతు ధరను మించి అమ్మకాలు
  • అయినా రైతుకు దక్కేది అంతంత మాత్రమే
  • పెరగనున్న నిత్యావసరాల ధరలు
  • సామాన్యుడి జేబుకు చిల్లు పడే అవకాశం 

 హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎల్‌‌‌‌నినో ప్రభావం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని, మార్కెట్లను కుదిపేయనున్నది. వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా పంటల దిగుబడులు గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తుండడంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. సన్న వడ్లు, పత్తి, మక్కజొన్న, కంది, పెసలు, పప్పు శనగలాంటి  పంటలకు మార్కెట్లో కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌‌‌పీ) కంటే భారీగా అదనపు ధరలు నమోదవుతున్నాయి. అయితే, చేతికి వచ్చే పంట ఉత్పత్తి పడిపోవడంతో ఈ ధరల పెరుగుదల వల్ల రైతులకు దక్కే ప్రయోజనం శూన్యంగా మారుతుండగా, అటు బియ్యం, పప్పులు, నూనె లాంటి నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర కామన్‌‌ రకానికి రూ.2,441, గ్రేడ్‌‌–ఏ రకానికి రూ.2,461గా ఉండగా.. బోనస్‌‌ కలిపి క్వింటాల్‌‌కు సుమారు రూ.2,941 వరకు దక్కే అవకాశం ఉంది. అయితే, బహిరంగ మార్కెట్‌‌లో సన్న వడ్లకు పెరిగిన డిమాండ్‌‌తో క్వింటాల్‌‌కు రూ.3 వేల వరకు ధర పలికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు తేమ పేరుతో కోతలు పెట్టకుండా రైతుల కల్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పత్తికి రూ.9 వేలపైనే..

పత్తికి కేంద్రం రూ.8,267 మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లలో సగటు మోడల్‌‌ ధర దాదాపు రూ.8,538గా నమోదవుతున్నది. ఖమ్మంలో రూ.9,100, వరంగల్‌‌లో రూ.8,900 వరకు పలుకుతున్నది. పత్తి దిగుబడులు, అంతర్జాతీయ మార్కెట్‌‌ పరిస్థితులు, దేశీయ డిమాండ్‌‌ ఆధారంగా ధరల్లో మరింత మార్పు ఉండే అవకాశం ఉంది. అయితే, పత్తి మొదటి తీత పనులు ఇప్పుడిప్పుడే షురూ కావడంతో ధరలు కొంత స్థిరంగానే కొనసాగుతున్నాయి. 

మిగిలిన పంటలకూ పెరుగుతున్న ధరలు

మక్కజొన్నకు రూ.2,410 మద్దతు ధర ఉండగా... బహిరంగ మార్కెట్‌‌లో రూ.2,700 నుంచి రూ.2,900 వరకు పలుకుతున్నది. ఇథనాల్​ఇంధన తయారీలో 60 శాతానికిపై మక్కజొన్న వినియోగిస్తున్న నేపథ్యంలో మార్కెట్లో మక్కలకు మంచి గిరాకీ ఉంటోంది. జొన్నకు రకాన్ని బట్టి రూ.4,023 నుంచి రూ.4,073 వరకు మద్దతు ధర ఉండగా, కొన్ని మార్కెట్లలో గరిష్టంగా రూ.6 వేల వరకు పలుకుతున్నది. మరో వైపు కంది మద్దతు ధర క్వింటాల్‌‌కు రూ.8,450 కాగా, రాష్ట్రంలోని మార్కెట్లలో ప్రస్తుతం రూ.8 వేల నుంచి రూ.9,500 మధ్య నమోదవుతున్నది. జహీరాబాద్‌‌ మార్కెట్‌‌లో దాదాపు రూ.8 వేల వరకు ధర ఉండగా, ఆదిలాబాద్‌‌ జిల్లాలో గరిష్టంగా రూ.9,539 వరకు ధర పలికింది. పెసరకు రూ.8,780 మద్దతు ధర కాగా.. బహిరంగ మార్కెట్‌‌లో రూ.13,800 నుంచి రూ.14 వేల వరకు ధర పలుకుతున్నది. పప్పుధాన్యాల కొరత ఏర్పడితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. పప్పుశనగకు మద్దతు ధర రూ.5,875గా ఉండగా.. కొన్ని చోట్ల రెట్టింపు ధరలు నమోదవుతున్నాయి. తాండూరు, వికారాబాద్‌‌ మార్కెట్లలో ఇటీవల గరిష్టంగా క్వింటాల్‌‌కు రూ.12,006 వరకు ధర పలికింది. 

సోయా, వేరుశనగకు మిశ్రమ ధరలు

సోయాబీన్‌‌కు కేంద్రం రూ.5,708 మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్లలో మాత్రం సగటు ధర దాదాపు రూ.5,387గా  ఉండగా, గరిష్టంగా రూ.7,028 వరకు నమోదైంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తున్నా, డిమాండ్‌‌ పెరగడంతో గరిష్ట ధరలు మద్దతు ధరను మించి నమోదవుతున్నాయి. వేరుశనగకు మద్దతు ధర రూ.7,517గా ఉండగా, మార్కెట్లలో సగటు మోడల్‌‌ ధర సుమారు రూ.7,253 నుంచి గరిష్టంగా రూ.9,513 వరకు నమోదైంది. దిగుబడి తగ్గి సరఫరా తగ్గితే నూనెగింజల ధరలు  మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌‌ వర్గాలు చెబుతున్నాయి.

సన్న వడ్లకు పెరిగిన డిమాండ్

వానాకాలం సీజన్‌‌‌‌లో సన్న వడ్లకు బహిరంగ మార్కెట్‌‌‌‌లో డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లలో బీపీటీ 5204, ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ 15048, హెచ్‌‌‌‌ఎంటీ సోనా, జై శ్రీరామ్‌‌‌‌, కేఎన్‌‌‌‌ఎం 1638, డబ్ల్యూజీఎల్‌‌‌‌ 44, కేఎన్‌‌‌‌ఎం 7715లాంటి 7 రకాలకే క్వింటాల్‌‌‌‌కు రూ.500 బోనస్‌‌‌‌ ప్రకటించింది.

నిత్యావసరాలపై ప్రభావం

ఇలా వడ్లు, మక్కలు, పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలులాంటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగినా దిగుబడులు తగ్గడం వల్ల రైతులకు పెద్ద గా ప్రయోజనం లేదు. కానీ మున్ముందు నిత్యావ సరాల రేట్లు భారీగా పెరిగే అవకాశ ముంది. ముఖ్యంగా వడ్లు, కందులు, పెసళ్లు, శనగలు లాంటి  పప్పుధాన్యాల ధరలు పెరగడం వల్ల  విని యోగదారులపై నేరుగా భారం పడు తుంది. సన్న బియ్యానికి డిమాండ్‌‌ కొనసాగితే బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతున్నది.