మార్కెట్‌‌‌‌లోకి నీరా పాలసీ..

మార్కెట్‌‌‌‌లోకి నీరా పాలసీ..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:ప్రభుత్వం త్వరలో నీరా పాలసీ తీసుకురావాలని భావిస్తోంది. సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించింది.  దీనిపై ఇప్పటికే ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం దేశంలోని నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే నీరా పాలసీ ఉంది. వీలైతే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి, వివరాలు సేకరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

కల్తీ కల్లు నియంత్రణకే..?

నీరా ఆరోగ్యానికి మంచిది కావడంతో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏటా రాష్ట్రంలో  వందలాది మంది మరణానికి కారణమవుతున్న కల్తీ కల్లును అరికట్టడంతోపాటు, గీత కార్మికులను ప్రోత్సహించాలనేది సర్కారు ఆలోచనగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నీరా పాలసీలో పొందుపరచాల్సిన విధివిధానాలు, ఎలా నిల్వ చేయాలి? ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? తదితర అంశాలతో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 40 ఏళ్ల కిందే నీరాకు సంబంధించిన నిబంధనలున్నాయి. కానీ అవి ఎక్కడా అమలు కావడంలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నాటక, గోవా, మహారాష్ట్ర,  కేరళ రాష్ట్రాల్లో నీరా పాలసీలు అమలవుతున్నందున అక్కడికి వెళ్లి అధ్యయనం చేయాలని భావిస్తున్నారు.

నీరా ఎట్ల వస్తదంటే..

నీరాను తాటి, ఈత చెట్ల నుంచి తీస్తారు. సూర్యాస్తమయం తర్వాత  ఆయా చెట్లను గీస్తే, సూర్యోదయంలోపు పారే కల్లునే  నీరా అంటారు.  ఇందులో ఎలాంటి ఆల్కహాల్‌‌‌‌ ఉండదని అధికారులు చెబుతున్నారు.  ఏడాది మొత్తం లభించే ఈ నీరాను సేకరించే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది.   సున్నపుతేటతో కుండను శుభ్రంగా కడిగి, ఆరిన తర్వాత కొంత సున్నపుతేటను లోపల పూసి సాయంత్రంవేళ చెట్టుకు కట్టాలి. తెల్లవారుజామున నాలుగున్నరలోపే  నీరాను సేకరించాలి. అప్పుడే పులిసిపోకుండా ఉంటుంది. దేశవ్యాప్తంగా14 కోట్ల తాటి చెట్లు ఉన్నట్లు అంచనా. వీటి సంఖ్యలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే, తెలంగాణ రెండోస్థానంలో  ఉంది.

స్టోరేజే ప్రధాన సమస్య..

నీరాను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నా, దానిని స్టోర్‌‌‌‌ చేయడమే పెద్ద సమస్య అని అధికారులు చెబుతున్నారు. ఉదయం సేకరించిన నీరాను వెంటనే తాగాలి. అప్పుడే అది తియ్యగా, రుచిగా ఉంటుంది.  మత్తు కూడా రాదు. ఆ తర్వాత పులిసిపోయి ఆల్కహాల్​ పరిమాణం పెరుగుతుంది. నీరా పులసిపోకుండా ఉండేందుకు  కోల్డ్​స్టోరేజీల్లాంటివి ఏర్పాటు చేస్తే సుమారు ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. పుణెలోని నేషనల్‌‌‌‌ కెమికల్‌‌‌‌ లాబోరేటరీ శాస్త్రవేత్తలు ఇదే పరిజ్ఞానాన్ని కనుగొన్నారని అధికారులు పేర్కొంటున్నారు. నీరాను ఏడాది పొడవునా నిల్వ ఉంచే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తూర్పు గోదావరి జిల్లా పందిరి మామిడిలోని డాక్టర్‌‌‌‌ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారని చెబుతున్నారు. నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.   గెల నుంచి కాకుండా కాయల నుంచి తీసిన నీరాలో పోషక విలువలు అధికంగా ఉంటాయని  స్పష్టం చేస్తున్నారు.