ఫిరాయింపుల పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టలేం : సుప్రీంకోర్టు

ఫిరాయింపుల పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టలేం : సుప్రీంకోర్టు
  • కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రిట్, కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీంకోర్టు
  • సోమవారం విచారణకు స్వీకరిస్తామన్న  సీజేఐ బీఆర్ గవాయ్​

న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీజేఐగా తాను రిటైర్ అయినంత మాత్రాన.. సుప్రీంకోర్టు బంద్ కాదని సీజేఐ బీఆర్ గవాయ్​ అన్నారు. వచ్చే సోమవారం ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. పార్టీ మారిన వారిపై అనర్హత వ్యవహారంలో ఈ ఏడాది జులై 31న సీజేఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ఆఫీసు అమలు చేయలేదని పేర్కొంటూ ఎమ్మెల్యే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్, ఇతరులు సోమవారం సుప్రీంకోర్టులో రెండు పిటిషన్ దాఖలు చేశారు.

 గత ఆదేశాలను అమలు చేయనందున పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టే అనర్హత వేటు వేయాలని రిట్ పిటిషన్, అలాగే ఆదేశాల అమల్లో జాప్యంపై స్పీకర్​పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్ మోహిత్ రావు సోమవారం సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. ఈ పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరముందని అభ్యర్థించారు. ‘ఈ నెల 24 న సీజేఐగా మీరు రిటైర్ అవుతున్నందున. మీరు వెళ్లే వరకు ఈ పిటిషన్లు బెంచ్ ముందు విచారణకు రాకుండా ఆలస్యం చేయాలని చూస్తున్నారు’ అని కోట్ చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ...‘అత్యవసర విచారణకు నిరాకరిస్తున్నాం. వచ్చే వారం ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపడతాం. ఒకవేళ నేను సీజేఐగా రిటైర్ అయినా.. నవంబర్ 24 తర్వాత సుప్రీంకోర్టు బంద్(మూసీ వేయరుగా) కాదుగా’ అని అన్నారు.