వృద్ధులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు : కలెక్టర్ కుమార్ దీపక్

వృద్ధులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు : కలెక్టర్ కుమార్ దీపక్
  • కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: వృద్ధులు భవిష్యత్​ తరాలకు మార్గదర్శకులని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా విద్యాధికారి యాదయ్య, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, అధికారులు, వృద్ధులతో కలిసి వాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, వయో వృద్ధులు హక్కులు, చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ నెల 21న పోలీస్, సంక్షేమ శాఖల సమన్వయంతో వయోవృద్ధులకు వారి హక్కులు, చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

అంతకుముందు కలెక్టరేట్​లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో యాసంగి 2025- 26 సీజన్ సిద్ధత, వ్యవసాయ కార్యకలాపాలు, పంట సాగు, కొనుగోలు వ్యవస్థలపై ప్రాథమిక చర్యలు, మార్గదర్శకాలు అంశాలపై కలెక్టర్​ సమీక్ష నిర్వహించారు. రైతులు లబ్ధిపొందే విధంగా పంట సాగు చేయాలని సూచించారు. జిల్లాలో ఈ యాసంగి సుమారు లక్షా 43వేల ఎకరాల్లో పంటలు సాగు జరిగే అవకాశం ఉందని, అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. 

అనంతరం పంట సాగులో డ్రోన్ వినియోగంపై క్రాప్ క్రాఫ్ట్స్ ఇన్నోవేషన్స్ కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వ్యవసాయ సాగులో నూతన సాంకేతిక డ్రోన్ల వినియోగం ద్వారా విప్లవాత్మక మార్పులతో అధిక పంట దిగుబడి పొందవచ్చని, అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.