కుటుంబ కలహాలతో.. వృద్ధ దంపతుల సూసైడ్.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో ఘటన

కుటుంబ కలహాలతో.. వృద్ధ దంపతుల సూసైడ్.. వికారాబాద్  జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో ఘటన

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్  జిల్లా యాలాల మండలంలోని రాస్నం గ్రామంలో ఆదివారం (సెప్టెంబర్ 07) కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. రాస్నం గ్రామానికి చెందిన మంచన్ పల్లి శ్రీనివాస్ రెడ్డి(63), భాగ్యమ్మ(55) దంపతులు. వీరికి ఐదెకరాల అసైన్డ్, రెండెకరాల పట్టా భూమి ఉంది. 

బయట అప్పులు కావడంతో రెండెకరాల పట్టా భూమిని అమ్మేశారు. వచ్చిన డబ్బుల్లో కొంత అప్పులు తీర్చేసి.. కొంత డబ్బు ఇద్దరు కొడుకులకు పంచారు. పెద్ద కొడుకు కరుణాకర్ రెడ్డి వ్యాపారం చేసుకుంటూ వేరే గ్రామంలో ఉంటున్నాడు. చిన్న కొడుకు దయాకర్ రెడ్డి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. 

డబ్బుల పంపకం విషయంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉదయం ఇంట్లో దూలానికి  ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనను తట్టుకోలేక భార్య భాగ్యమ్మ సమీపంలో వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాండూర్  జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.