ఆరెకరాల భూమి లాక్కున్నరు.. కొడుకు పట్టించుకుంటలేడని.. పోలీస్ స్టేషన్ కు వృద్ధ దంపతులు

ఆరెకరాల భూమి లాక్కున్నరు.. కొడుకు పట్టించుకుంటలేడని..  పోలీస్ స్టేషన్ కు వృద్ధ దంపతులు
  • కరీంనగర్  జిల్లా హుజూరాబాద్‌‌‌‌లో ఘటన

హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్  జిల్లా హుజూరాబాద్  మండలం ఇప్పల నర్సింగాపూర్  గ్రామానికి చెందిన గుర్రాల రాజిరెడ్డి, ప్రమీల దంపతులు మంగళవారం పోలీస్​స్టేషన్​కు వెళ్లి తమను కొడుకు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు ఓ కొడుకు, కూతురు ఉన్నారని, ఆరెకరాల భూమిని పదేళ్ల కింద కొడుకు గుర్రాల మహేందర్​రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్  చేశామని చెప్పారు. కొద్ది రోజులు బాగానే చూసుకున్నారని, ఆ తరువాత కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదని వాపోయారు. 

ప్రతి నెలా వచ్చే రూ.2 వేల పింఛన్​తో బతుకుతున్నామని చెప్పారు. అనారోగ్యతో బాధపడుతున్నాం.. ఆసుపత్రికి తీసుకెళ్లమంటే వేధింపులకు గురి చేస్తూ బూతులు తిడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తమ కొడుకు, కోడలును పిలిపించి తమ బాగోగులు చూసుకునేలా చూడాలని వేడుకున్నారు. వృద్ధ దంపతుల కొడుకును పిలిపించి కౌన్సెలింగ్  ఇస్తామని సీఐ కరుణాకర్  తెలిపారు.