కొడుకులు బువ్వ పెడ్తలేరు.. పింఛన్ వస్తలేదు

కొడుకులు బువ్వ పెడ్తలేరు..  పింఛన్ వస్తలేదు

హనుమకొండ , వెలుగు: కన్నకొడుకులు బువ్వ పెట్టడం లేదని, 60 ఏండ్ల వయసుండి, డిసేబులిటి సర్టిఫికేట్ ఉన్నా పింఛన్ రావడం లేదని వృద్ధురాలు సోమవారం హనుమకొండ కలెక్టరేట్​లో జరిగిన గ్రీవెన్స్ లో మొరపెట్టుకుంది. ఆకలి తీర్చుకోవడానికి ఇండ్లలో అడుక్కోవాల్సి వస్తోందని వాపోయింది. బాధితురాలు తెలిపిన ప్రకారం.. హనుమకొండ న్యూశాయంపేటకు చెందిన జూపాక సమ్మక్క, రాజయ్య భార్యాభర్తలు. ఇద్దరి వయసు 60 ఏండ్లు దాటింది. వీరికి కూతురు, నలుగురు కొడుకులు కాగా, అందరికీ పెండ్లి చేశారు. 

తమకున్న భూమిని నలుగురు కొడుకులకు పంచి, ఇండ్లు కట్టించారు. కానీ వృద్ధాప్యంలో కొడుకులు పట్టించుకోకపోవడంతో తిండికి ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏండ్ల వయసు దాటినా వీరికి పింఛన్ రావడం లేదు. సమ్మక్క కాలు సరిగా పనిచేయక మంచానికే పరిమితం కావడంతో ఆమెను పోషించడానికి రాజయ్య తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి తీర్చుకోవడానికి అన్నం అడుక్కోవాల్సి వస్తోందని వృద్ధురాలు వాపోయింది. తమకు పింఛన్ ఇప్పించి, న్యాయం చేయాలని గ్రీవెన్స్​లో అధికారులను వేడుకుంది.