- అన్ని ప్యానళ్లకు లీడర్లు కాంగ్రెస్ వాళ్లే
- మూల వెంకటరవీందర్ రెడ్డి, కర్ర రాజశేఖర్ ప్యానళ్ల మధ్యే ప్రధాన పోటీ !
- ఎవరు గెలిచినా కాంగ్రెస్ ఖాతాలోనే
- ఆసక్తికరంగా మారిన అర్బన్ బ్యాంకు ఎన్నికలు
- ఐదు నామినేషన్లు విత్ డ్రా.. బరిలో 54 మంది
కరీంనగర్, వెలుగు: అర్బన్ బ్యాంకు ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శనివారం ముగిసింది. మొత్తం 73 నామినేషన్లు దాఖలు కాగా 14 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మిగిలిన 59 నామినేషన్లలో శనివారం ఐదుగురు ఉపసంహరించుకోగా.. బరిలో 54 మంది మిగిలారు. వీరిలోనూ 12 డైరెక్టర్ పోస్టులకుగానూ 36 మంది మూడు ప్యానెళ్లలో పోటీ చేస్తున్నారు.
మిగతా 18 మంది ఎలాంటి ప్యానెల్‌లో లేకుండా ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. కాగా వీరిలో ఆయా ప్యానెళ్లకు నాయకత్వం వహిస్తున్న ముగ్గురూ కాంగ్రెస్ వారే కావడం విశేషం. 12 డైరెక్టర్ పోస్టుల్లో 9 జనరల్ స్థానాలుగా, రెండు మహిళలకు, ఒక పోస్టు ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ అయి ఉంది. ఇందులో జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. 9,287 సభ్యత్వం కలిగిన అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి నవంబర్ 1న ఎన్నికల జరగనున్నాయి.
అన్ని ప్యానెళ్లకు లీడర్లు కాంగ్రెస్ వాళ్లే..
అర్బన్ బ్యాంకు ఎన్నికలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినప్పటికీ.. పరోక్షంగా పార్టీల మద్దతుతోనే ప్యానెళ్ల ఏర్పాటు కావడం చాలా ఏళ్లుగా వస్తోంది. ఈ సారి తలపడుతున్న మూడు ప్యానెళ్లకు కాంగ్రెస్ లీడర్లే నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు బలపరుస్తున్న మూల వెంకటరవీందర్‌రెడ్డి ఓ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తుండగా.. ఈ ప్యానల్‌కు వెలిచాల మద్దతు తెలుపుతుండగా.. మంత్రి పొన్నం ప్రభాకర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆశీర్వాదం ఉన్నట్లు సమాచారం. మూల వెంకటరవీందర్ రెడ్డి ప్యానల్ గెలుపును వెలిచాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మరో ప్యానెల్‌కు కాంగ్రెస్ నాయకుడు, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ప్యానల్‌లో కాంగ్రెస్ తోపాటు గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన బీజేపీ, బీఆర్ఎస్‌కు చెందినవారున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్యానల్ కు ఆ పార్టీల నాయకుల మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో రాజశేఖర్ రెండు సార్లు చైర్మన్‌గా పని చేయడం ఆయనకు కలిసొచ్చేలా అంశంగా భావిస్తున్నారు. రాజశేఖర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారం కోరినట్లు తెలిసింది.
గత ఏడాదిపాటు అర్బన్ బ్యాంకు చైర్మన్ గా పనిచేసి, కోరం లేకుండానే సమావేశాలు నిర్వహించి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ నాయకుడు గడ్డం విలాస్‌రెడ్డి కూడా కొందరితో ప్యానల్ సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఏ ప్యానల్ గెలిచినా కాంగ్రెస్ ఖాతాలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే మూల వెంకటరవీందర్ రెడ్డి, కర్ర రాజశేఖర్ ప్యానళ్ల మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఎటూ తేల్చని బీజేపీ, బీఆర్ఎస్
కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ ఇంట్లో మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్ ఈ నెల 19న సమావేశమయ్యారు. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం పూర్తయినా ఇప్పటివరకు ప్యానల్ విషయమై బీజేపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే బీఆర్ఎస్ కూడా ఇప్పటివరకు తమ వైఖరిని ప్రకటించలేదు. ఎన్నికలకు ఇంకా ఆరు రోజులే సమయమే మిగిలి ఉంది.
