లోకల్​గా ఇల్లు, ఆఫీసు.. ఆశావహుల ఏర్పాట్లు

లోకల్​గా  ఇల్లు, ఆఫీసు.. ఆశావహుల ఏర్పాట్లు
  • సెగ్మెంట్లలో ఏర్పాటు చేసుకుంటున్న ఆశావహులు
  • సిద్దిపేట జిల్లాలో అన్ని పార్టీల నేతలు బిజీ

సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్న నేతలు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో లోకల్ రెసిడెన్సీ వేటలో పడ్డారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో టెంపరరీ ఆఫీసులు, ఇండ్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు నియోజకవర్గ కేంద్రాల్లో ఆఫీసులను ఏర్పాటు చేసుకుంటున్నారు. హుస్నాబాద్ లో పార్టీ ఆఫీస్ ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించుకున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం తాత్కాలిక ఆఫీసును ప్రారంభించారు. ఇంటి నిర్మాణానికి కొంత స్థలం కొన్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి.. హుస్నాబాద్ లో రెండు నెలల కిందనే ఆఫీసు ప్రారంభించి ప్రచారం చేస్తున్నారు. హుస్నాబాద్ బరిలో నిలవాలని భావిస్తున్న సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి.. ప్రత్యేక భవనాన్ని అద్దెకు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 

బీజేపీ టికెట్ ఆశావహులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, రాంగోపాల్ రెడ్డి సైతం నివాసాలతో పాటు తాత్కాలిక ఆఫీసులు ప్రారంభించారు. దుబ్బాక కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కత్తి కార్తీక, చెరుకు శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. మరో కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ రెడ్డి ఆఫీసు ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిది మండల పరిధిలోని పోతారం గ్రామం కాగా.. నియోజకవర్గ కేంద్రంలో కొత్త భవనాన్ని నిర్మించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవలే నియోజకవర్గ కేంద్రంలో కొత్త భవనాన్ని నిర్మించుకున్నారు. గజ్వేల్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న శ్రీకాంత్ రావు, జశ్వంత్ రెడ్డి తమ భవనాలను ఆఫీసులుగా మారుస్తున్నారు.