
- ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రంగంలోకి దిగిన ఆఫీసర్లు
- వెహికిల్స్ తనిఖీలు చేస్తున్న పోలీసులు
- లిక్కర్, నగదు రవాణాపై నిఘా
- ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు తీసేస్తున్న సిబ్బంది
- నాయకుల విగ్రహాలకు ముసుగులు
నెట్వర్క్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో సోమవారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. స్టేట్లోకి ఎంటరయ్యే అన్ని అంతర్రాష్ట్ర బార్డర్లతో పాటు జిల్లాల బార్డర్లలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. లిక్కర్, నగదు రవాణాపై ఆంక్షలు ఉండడంతో అన్ని రకాల వాహనాలను చెక్ చేస్తున్నారు. ఆయా చెక్ పోస్టుల్లో లోకల్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ జవాన్లకు డ్యూటీలు వేశారు. అటు ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కారు స్కీములకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, సీఎం కేసీఆర్, మంత్రుల ఫొటోల తొలగింపు మొదలుపెట్టారు.
గ్రామాల్లో పంచాయతీ, అర్బన్ ఏరియాల్లో మున్సిపల్, కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగి, ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీలు, నేతల ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఎన్నికల కోడ్‌పై నియోజకవర్గాలవారీగా ఇప్పటికే పొలిటికల్ పార్టీల లీడర్లకు అవగాహన కల్పించిన కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు తాజాగా షెడ్యూల్ వెలువడిన వెంటనే మరోసారి జిల్లాల వారీగా ప్రెస్మీట్లు పెట్టి మరీ ఎన్నికల నియమావళి గురించి వివరించారు. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నేతలు ప్రచారం కోసం వాడే వెహికిల్స్, మైకులు, సౌండ్‌బాక్సుల కోసం ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.
భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్..
పొరుగు రాష్ట్రాల నుంచి భద్రాచలం ఏజెన్సీలోకి ప్రవేశించే రహదారులను పోలీసులు చక్రబంధనం చేశారు. కూనవరం రోడ్డులో చెక్‌పోస్ట్ ఏర్పాటుచేసి ఆంధ్రా,చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రంలోకి లిక్కర్, నగదు రవాణా జరకుండా చర్యలు తీసుకుంటున్నారు. చర్ల రోడ్డులో ఆంధ్రా-–తెలంగాణ బోర్డర్‌లోనూ చెక్ పోస్టు పెట్టారు. ఈ ఏరియా నుంచి ఎన్నికల కోసం గుడుంబా, ఇతర రాష్ట్రాల మద్యం వచ్చే అవకాశం ఉన్నందున నిఘా పెంచారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ప్రవేశించే ప్రమాదం ఉందనే ఇంటెలిజెన్స్ రిపోర్టులతో కొత్త వ్యక్తుల ప్రవేశంపై దృష్టిపెడ్తున్నారు.
లిక్కర్, మనీలాండరింగ్‌పై నిఘా పెట్టాం: డీజీపీ అంజనీకుమార్
మహదేవపూర్: కోడ్ అమల్లోకి వచ్చినందున లిక్కర్, డ్రగ్స్, మనీ లాండరింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఎక్కువ నిఘా పెడ్తామని, అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. డీజీపీ సోమవారం స్టేట్ బోర్డర్ లో ఉన్న కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి చెక్ పోస్ట్ , మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇన్ అండ్ అవుట్ పోస్ట్ లను పరిశీలించి పోలీస్ ఆఫీసర్లకు, సిబ్బందికి సూచనలిచ్చారు.
కాళేశ్వరం టెంపుల్లో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్థానిక పోలీస్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా సాగడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా తమకు సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం తెలియజేయాలని కోరారు. వెంట డీఎస్పీ రామ్మోహన్, మహాదేవపూర్ సీఐ కిరణ్ కుమార్, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు, మహాదేవపూర్ ఎస్ఐ రాజ్ కుమార్ ఉన్నారు.