తెలంగాణలో అమల్లోకి ఎలక్షన్ కోడ్.. రూ.50 వేలకు మించి ఒక్క రూపాయి ఎక్కువున్నా సీజ్..!

తెలంగాణలో అమల్లోకి ఎలక్షన్ కోడ్.. రూ.50 వేలకు మించి ఒక్క రూపాయి ఎక్కువున్నా సీజ్..!

హైదరాబాద్: లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్‌‎ విడుదల కావడంతో పల్లెల్లో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సోమవారం (సెప్టెంబర్ 29) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ కావడంతో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది. 

ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని నిబంధనలు మారుతాయి. అందులో కీలకమైనది నగదు నిబంధన. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ డబ్బు ఉండి.. సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్‌ చేస్తారు. ఎక్కువ మొత్తంలో నగదు పట్టుబడితే ఐటీ, జీఎస్టీ అధికారులు ద్వారా కోర్టులో జమ చేస్తారు. 

డబ్బు తక్కువగా ఉంటే రెవెన్యూ అధికారుల దగ్గర డిపాజిట్ చేస్తారు.అత్యవసరాల కోసం ఎక్కువ డబ్బు తీసుకెళ్లి సౌలభ్యం కల్పించింది ఈసీ. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్య అవసరాల కోసం పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లాలి అనుకునే వారు తప్పనిసరిగా సరైన ధృవపత్రాలు వెంట తీసుకెళ్లాలి. 

ఒకవేళ తనిఖీల సమయంలో ఆధారాలు చూపలేకపోయినా.. తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే సీజ్ చేసిన డబ్బును తిరిగి ఇస్తారు. సోమవారం (సెప్టెంబర్ 29) నుంచి రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సోమవారం నుంచి తనిఖీలు మొదలుపెట్టారు పోలీసులు, ఆబ్కారీ అధికారులు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై వాహనాలను ముమ్మురంగా సోదాలు చేశారు.