కంచే చేను మేసినట్టుగా ఈసీ తీరు..ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఇవ్వాల్సిందే : ప్రొఫెసర్ కోదండరాం

కంచే చేను మేసినట్టుగా ఈసీ తీరు..ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఇవ్వాల్సిందే : ప్రొఫెసర్ కోదండరాం
  • ‘సర్’ అక్రమాలపై  ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష

హైదరాబాద్, వెలుగు: కంచే చేను మేసినట్టుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు వ్యవహరించే పరిస్థితి ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సర్ ప్రక్రియను నిలిపివేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  కోదండరాం మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సమావేశాలు సక్రమంగా జరగకపోవడం, సర్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. 

సర్ ప్రక్రియను నిలిపివేసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పౌరుల హక్కులను కాపాడేందుకు తెలంగాణ జన సమితి పోరాటాన్ని కొనసాగిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్  కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫాం6లో అదనపు అంశాలను చేర్చడం అనేక ప్రశ్నలకు దారితీసిందన్నారు. ఈ కార్యక్రమంలో విప్‌ అద్దంకి దయాకర్, టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్‌, నిజ్జన రమేశ్‌ ముదిరాజ్, పల్లె వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.